ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
100 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత
సూర్యాపేట,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma housing scheme) అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandlal Pawar) తెలిపారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితతో కలిసి మాట్లాడారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మొదటి విడతలో 319 ఇళ్లు, రెండో విడతలో మరో 657 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు వారం రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించి, 100 రోజుల్లోగా అంటే వచ్చే జనవరి 26 నాటికి పూర్తి చేసుకోవాలని సూచించారు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని, బేస్మెంట్, లింటెల్, రూఫ్ లెవల్ దశల్లో ఫోటోల ఆధారంగా విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు పూర్తి సహకారం అందిస్తారని, నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సహకారంతో పథకం విజయవంతంగా అమలు జరుగుతోందన్నారు.
ఇళ్ల నిర్మాణాల ద్వారా మేస్త్రీలు, కూలీలు, వ్యాపారులకు ఉపాధి లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. ఇదే సమయంలో మున్సిపాలిటీ పరిధిలో కొత్త పెన్షన్ల కోసం 3,100 దరఖాస్తులు నమోదయ్యాయని, త్వరలోనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, హౌసింగ్ పిడి జబ్బర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.