విద్యుత్ కొరత, లోవోల్టేజీ సమస్యలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు

10-09-2026 | 12:58am

పాలకీడు,(విజయక్రాంతి): విద్యుత్ కొరత, లోవోల్టేజీ సమస్యలతో(low voltage problems) పాలకీడు మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం మండల కమిటీ సభ్యుడు, గుడుగుంట్లపాలెం మాజీ ఎంపీటీసీ దొంగల వెంకటయ్య(Former MPTC Dongala Venkataiah) ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ... సాగర్ జలాలు విడుదలైనప్పటికీ కాలువలకు సమీపంలోని భూములకు మాత్రమే నీరు అందుతుండగా, ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించేవారని, ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సరఫరాను క్రమంగా తగ్గించిందని వెంకటయ్య ఆరోపించారు.వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులకు విద్యుత్ కొరత తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనే విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉండటం విచారకరమని వెంకటయ్య అన్నారు. లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందని తెలిపారు. అధికారులు సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు