పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు!
- వీధికో బిర్యాని సెంటర్
- కూడళ్లలో హోటల్ అధికారుల తనిఖీలు నామ మాత్రమేనా..?
- ప్రజారోగ్యం పాలిట శాపంగా మారుతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్
నేరేడుచర్ల, అక్టోబర్ 12 : నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలో బిర్యానీ సెంటర్లు(Biryani Centers) పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మిర్యాలగూడ -కోదాడ ప్రధాన రహదారి(Miryalaguda-Kodad Main Road),జానపహాడ్, పాత నేరేడుచర్ల, రామాపురం రోడ్లతో పాటు చిన్న సందుల్లోనూ వీధికో బిర్యానీ సెంటర్ వెలిసింది.
తనిఖీలు నామమాత్రమేనా?
హోటల్లు బిర్యాని సెంటర్ల నిర్వహణలో ఆహార భద్రత ప్రమాణాలు(Food safety standards) అమలవుతున్నాయా లేదా అన్నది నిర్మించాల్సిన బాధ్య త సంబంధిత అధికారులదే. కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందించడం కాకుండా ముందస్తు ప్రణాళికతో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. వంట గదుల పరిస్థితులు,ఆహార పదార్థాల నిల్వ,సిబ్బంది పరిశు భ్రత, మాంసం నాణ్యత, వంటకు ఉపయోగించే నూనె వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
అయితే తనిఖీలు ఎన్ని నిర్వహించారు..? ఎన్ని ఉల్లంఘనలు గుర్తించా రు..? ఎన్ని ఆహార నమూనాలను ప్రయోగశాలలకు పంపారు..? నిబంధనలు ఉల్లం ఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? అనే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. తనిఖీలు కేవలం రికార్డులకే పరిమితమైతే వాటి ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఆకర్షణీయ బోర్డులు, తక్కువ ధర ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ సెంటర్లలో ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనేది ప్రశ్నార్థకం. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మాంసం, నూనెల నాణ్యతపై నిఘా ఏదీ?
బిర్యానీ తయారీలో వాడే చికెన్,మటన్, ఫిష్ సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తున్నారా? పాడైపోయిన మాంసం వాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వంటకు వాడే నూనెను పదేపదే వేడి చేసి వాడటం వల్ల హానికరమైన పదార్థాలు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వంటగదుల పరిశుభ్రత గాలికొదిలేశారా?
హోటల్ బయట మెరుపులు ఉన్నా లోపల వంటగదుల్లో అపరిశుభ్రత, వ్యర్థాలు, కలుషిత నీరు వాడకం వంటివి ఆహార కలుషితానికి కారణమవుతున్నాయి.
లైసెన్సులు ఉన్నాయా?
మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ని హోటళ్లకు ఫుడ్ లైసెన్స్ ఉంది? లైసెన్స్ ఉంటే సరిపోతుందా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై స్పష్టత లేదు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా ఆకస్మిక తనిఖీలు చేపట్టి,నమూనాలు సేకరించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.