భూములనమ్మి పబ్బం గడుపుకుంటున్న ప్రభుత్వం
- భవిష్యత్ తరాలకు ఏం మిగులుస్తారు?
- డీసీఎంఎస్‌ల విలీనం పేరుతో రూ.5 వేల కోట్ల ఆస్తులపై కన్ను
- ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ చీఫ్ కవిత ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ భూముల వేలం, సహకార సంస్థల(Cooperative organization) విలీనంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రభుత్వ భూములను వేలం వేస్తూ ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఇలా విక్రయించుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు రాష్ట్ర సంపదను పెంచుతామని, తమ పార్టీకి 130 ఏళ్ల అనుభవం ఉందని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రభుత్వ భూములను వేలం వేస్తూ సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. భూముల వేలంతోనే ప్రభుత్వ ధనదాహం తీరడం లేదని, సుమారు రూ.5 వేల కోట్ల ఆస్తులు ఉన్న డీసీఎంఎస్‌లపై కూడా కన్నేసిందని ఆరోపించారు. ఆ సంస్థల భూములను తమకు అనుకూలమైన వారికి అప్పగించేందుకు ప్రణాళికలు రచిస్తోందని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న డీసీఎంఎస్‌లను నష్టాల్లో ఉన్న మార్క్‌ఫెడ్‌లో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.
కరీంనగర్, వరంగల్ డీసీఎంఎస్‌ల విలీనానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, మిగిలిన ఏడు డీసీఎంఎస్‌లను కూడా విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. గ్రామ స్వరాజ్యం, సహకార వ్యవస్థ బలోపేతం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారని, ఆయన పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ భూముల వేలం, డీసీఎంఎస్‌ల విలీన నిర్ణయాలను తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.