తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

23-11-2026 | 06:34am

తిరుచ్చి: తమిళనాడు(Tamil Nadu)లో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి జిల్లా(Tiruchirappalli District)లో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేపచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదం(Accident)లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నామక్కల్ జిల్లాలోని ఎరుమపట్టిలో చెవులు కుట్టించే వేడుకకు హాజరైన పది మంది, తంజావూరు జిల్లాలోని తిరుకట్టుపల్లికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జంబునాథపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరుపట్టి ఫోర్ రోడ్స్ సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధిత కుటుంబాలకు ప్రధాని ఆర్థిక సాయం

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(Tamil Nadu CM Joseph Vijay) కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.


మరిన్ని వార్తలు