టెక్నాలజీతో పోయిన ఫోన్‌ ట్రేస్‌

18-10-2026 | 02:05pm

బూర్గంపాడు (విజయక్రాంతి): పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం (Technology) సాయంతో గుర్తించిన బూర్గంపాడు పోలీసులు బాధితుడికి తిరిగి అందజేశారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మనోజ్‌ గత నెల చివరి వారంలో తన మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్సై మేడ ప్రసాద్‌ పర్యవేక్షణలో పోలీసులు మొబైల్‌ ట్రాకింగ్‌ (Mobile Tracking) సాంకేతికతను ఉపయోగించి ఫోన్‌ ఆచూకీని గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫోన్‌ కరకగూడెంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. అక్కడికి వెళ్లి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై మేడ ప్రసాద్‌ బాధితుడు మనోజ్‌కు ఫోన్‌ను అందజేశారు.

పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి అందించిన పోలీసులకు మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నవారు ఆందోళన చెందకుండా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌ వివరాలు, ఐఎంఈఐ నంబరు (IMEI Number) అందుబాటులో ఉంటే పోలీసుల దర్యాప్తునకు ఉపయోగపడతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు