అంబరాన్నంటిన బోనాల సంబురం..

18-10-2026 | 03:20pm

* అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన మహిళలు

* శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు 

పాపన్నపేట, అక్టోబర్18: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri Celebrations) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి మండల కేంద్రం పాపన్నపేటలో అమ్మవారికి బోనాల ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే గ్రామస్తులు అమ్మవారి ఓడిబియ్యం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు కొత్త కుండలను రంగురంగులతో అందంగా అలంకరించి, వాటిలో పసుపు, కుంకుమ, నైవేద్యంతో సిద్ధం చేసిన బోనాలను తలపై ఎత్తుకొని మంగళహారతులు, డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు.

అమ్మవారికి బోనం, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. గ్రామం చల్లగా చూడాలని, పంటలు బాగా పండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, గ్రామస్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు