గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
సుజాతనగర్, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(Bhadradri Kothagudem District SP Rohit Raju) ఆదేశాల మేరకు సుజాతనగర్ మండల పరిధిలోని గరీబ్‌పేట గ్రామంలో(Garibpeta village) శనివారం తెల్లవారుజామున 04:00 గంటల నుంచి 07:00 గంటల వరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Cordon and search operation) నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 19 త్రిచక్ర వాహనాలను గుర్తించి, మొత్తం 87 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. అదేవిధంగా 30 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్థులతో మాట్లాడుతూ, గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ వహించాలని కోరారు. కోడిపందాలు, పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఓటీపీ, యూపీఐ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో సిఐలు యాసీన్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, శ్రీలక్ష్మి, పోలీస్ అధికారులు, సుమారు 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.