సుందరయ్య నగర్‌ సమస్యలు పరిష్కరించాలి

18-09-2026 | 12:34pm

పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శికి సీపీఎం వినతి

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇందిరానగర్‌ గ్రామపంచాయతీ(Indiranagar Gram Panchayat) పరిధిలోని సుందరయ్య నగర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం(CPM) ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామపంచాయతీ సర్పంచ్‌ పాయం లలిత, కార్యదర్శి నాగమణికి వినతిపత్రం అందజేశారు. సీపీఎం ఆధ్వర్యంలో కాలనీలో సర్వే నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన అనంతరం వినతిపత్రం సమర్పించారు. సుందరయ్య నగర్‌లో ప్రవహిస్తున్న సింగరేణి(Singareni) ప్రధాన కాలువను సంస్థ ఆధ్వర్యంలో నిర్మించాలని, అప్పటి వరకు కాలువలో పేరుకుపోయిన సిల్ట్‌, చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ కవర్లు, పిచ్చిమొక్కలను తొలగించాలని సీపీఎం నాయకులు కోరారు.

మిషన్‌ భగీరథ నీరు వారంలో నాలుగు రోజులు సరఫరా కావడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు పాత పైప్‌లైన్లను తొలగించి కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. డౌన్‌ ఏరియాలో నాలుగు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని, రహదారికి ఇరువైపులా, ఖాళీ ఇళ్ల వద్ద పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని, కోతులు, కుక్కల బెడదను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి కొడెం బోస్‌, సీపీఎం జిల్లా నాయకులు అబ్దుల్‌ నబీ, ఇల్లందు పార్టీ కార్యదర్శి ఆలేటి కిరణ్‌కుమార్‌, 3వ వార్డు సభ్యురాలు సోమ సుజాత, 4వ వార్డు సభ్యుడు శ్రీకాంత్‌ పాసి, సీపీఎం సీనియర్‌ నాయకులు అబ్బాస్‌, సోమకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు