ప్రధాన రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని సిపిఎం రాస్తారోకో
మండల కేంద్రంలో దుమ్ము,ధూళిలను నియంత్రించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇసుక లారీలను నిలుపుదల చేయాలి
వెంకటాపురం,(విజయ క్రాంతి): ప్రధాన రహదారి కొత్త రోడ్ల పనులను(Road Works) వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు బోధపురం సిపిఎం శాఖ(Bodhapuram CPM Branch) ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన రహదారి దారుణంగా మారి నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ప్రజలు అనేక ఆందోళన ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేసి నెలలు కావస్తున్న పనులను ఇంకా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు కూడా పనులను ప్రారంభించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని విమర్శించారు రోడ్లు గుంతల మయం అవ్వడంతో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, విద్యార్థులు, అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇసుక లారీలను నిలుపుదల చేయాలని సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేసిన నేపథ్యంలో నిలుపుదల చేసిన జిల్లా అధికార యంత్రాంగం మరల తిరిగి గత కొద్ది రోజుల నుండి ఎందుకు అనుమతులు ఇచ్చిందో మండల ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
చర్ల ఇసుక లారీలను వెంటనే నిలుపుదల చేయాలని ఆయన కోరారు, ఇసుక లారీల వల్ల మండల కేంద్రంతో పాటు, ఆలుబాక, భోదాపురం గ్రామాలలో దుమ్ము ధూళితో ప్రజలు వ్యాపారస్తులు శ్వాసకోశ వ్యాధులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వాటర్ ట్యాంకర్ల ద్వారా పై గ్రామాలలో రోడ్లను తడిపించాలని కోరారు సంఘటన స్థలానికి చేరుకున్న వెంకటాపురం ఎస్సై కే తిరుపతిరావు నాయకులతో చర్చించి, ఆర్ అండ్ బి,టి ఎస్ ఎం డి సి ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారం రోజులలో కొత్త రోడ్ల పనులను ప్రారంభిస్తారని, దుమ్ముదులికి చర్యలు చేపడతారని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు ఈ కార్యక్రమంలో బోదాపురం సర్పంచ్ కొరస నరసింహారావు, మండల నాయకులు కాపుల వెంకటేశ్వర్లు, పరిషిక కృష్ణ, తోట నాగేశ్వరరావు, కొరస వంశి, కోర్స ప్రవీణ్, రాజు, పూజారి నరసింహస్వామి, జి కృష్ణ, చందర్రావు తదితరులు పాల్గొన్నారు