ట్రాక్టర్ల స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు
► అడ్డుకున్న గిరిజనులు.. అధికారులతో వాగ్వాదం
► పురుగుల మందు తాగిన మహిళ.. ఆసుపత్రికి తరలింపు
► ఉద్రిక్తత నేపథ్యంలో వెనుదిరిగిన అధికారులు
నాగిరెడ్డిపేట,అక్టోబరు 10 (విజయక్రాంతి): అటవీ భూమిని(Forest land) చదును చేసేందుకు వినియోగించిన ట్రాక్టర్ డోజర్‌ను(Tractor Dozer) స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను(Forest officials) గిరిజనులు అడ్డుకోవడంతో నాగిరెడ్డిపేట మండలం(Nagireddypet Mandal) పల్లెబోగుడా తండాలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది.ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా తండావాసులు అడ్డుగా నిలిచి వాగ్వాదానికి దిగారు.ఈ క్రమంలో ట్రాక్టర్ యజమాని వినోద్ తల్లి సంత్యాలి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అటవీశాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు తండా శివారులోని అటవీ భూమిలో సుమారు 14 ఎకరాలను ట్రాక్టర్ డోజర్ సహాయంతో చదును చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఎల్లారెడ్డి అటవీ రేంజ్(Yellareddy Forest Range) అధికారి రమేష్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని, భూమి చదును చేసేందుకు వినియోగించిన ట్రాక్టర్ డోజర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.అయితే, గతంలో ఇతర ట్రాక్టర్లతో భూమిని చదును చేసినప్పటికీ తమ వాహనాలనే ఎందుకు తీసుకెళ్తున్నారని గిరిజనులు అధికారులను ప్రశ్నిస్తూ అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకున్నాయి.ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో యజమాని వినోద్ తల్లి సంత్యాలి పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు.అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తండావాసులు ద్విచక్రవాహనంపై ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ట్రాక్టర్‌కు నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న నాగిరెడ్డిపేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అటవీశాఖ అధికారులు ట్రాక్టర్ డోజర్‌ను స్వాధీనం చేసుకోకుండానే వెనుదిరిగారు.