రైతులకు శుభవార్త.. పాత కాల్వకు ఈ నెల 14న నీరు విడుదల!

11-10-2026 | 08:25pm
  1. మంత్రి పొంగులేటి చొరవతో సాగునీటి విడుదలకు నిర్ణయం 
  2. రైతుల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బజ్జూరి వెంకటరెడ్డి 

కూసుమంచి, అక్టోబర్ 11(విజయక్రాంతి) : పాలేరు పాత కాల్వ ఆయకట్టు(Paleru Old Canal Ayacut) రైతులకు శుభవార్త. పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 14వ తేదీన పాత కాల్వకు సాగునీరు విడుదల(Release of irrigation water) చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అధికారులను ఆదేశించారు. రైతుల సాగునీటి సమస్యను కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి, నీటిని విడుదల చేయాలని వివరించారు. దీంతో స్పందించిన మంత్రి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

కూసుమంచి, నేలకొండపల్లి మండలాల పరిధిలోని పాత కాల్వ ఆయకట్టులో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండటంతో రైతులకు సాగునీరు అందించాలన్న విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సుమారు 200 క్యూసెక్కుల నీటిని మూడు రోజుల పాటు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మంత్రి, మండలాధ్యక్షుడికి రైతుల కృతజ్ఞతలు 

రైతుల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సాగునీటి విడుదలకు కృషి చేసిన బజ్జూరి వెంకటరెడ్డికి ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బజ్జూరి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు సాగునీరు అందించాలన్న నిర్ణయం హర్షణీయమన్నారు.

ఆయకట్టు స్థిరీకరణకు లింక్‌ కాల్వ 

మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ ద్వారా పాలేరు జలాశయంలోకి మళ్లించేందుకు లింక్‌ కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం రూ.162.54 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో పాలేరు పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు