ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలి

26-10-2026 | 07:22pm

దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన

దమ్మపేట,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) పిలుపునిచ్చారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ విధానంలో చేపడుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని దమ్మపేట మండలంలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బాలరాజుగూడెం, జగ్గారం, అంకంపాలెం, పట్వారిగూడెం, పార్కలగండి గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికీ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కక్కిరాల రమేష్, కూరం అర్జున్ రావు, కాంగ్రెస్ నాయకులు బొల్లికొండ నాగేశ్వరరావు, కోర్సా సాగర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు