నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- సీపీఎం మండల కార్యదర్శి మచ్చా రామారావు
చర్ల,(విజయక్రాంతి): చర్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన నాయి బ్రాహ్మణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చా రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులు తరతరాలుగా క్షౌర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవనోపాధికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వృత్తి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రుణ సౌకర్యాలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాంప్రదాయ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ నిబంధనలు, వృత్తి అర్హతలు, లైసెన్సింగ్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సెలూన్ వృత్తిలో నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తూనే, నాయి బ్రాహ్మణుల సాంప్రదాయ వృత్తి హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. యువతకు ఆధునిక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. నాయి బ్రాహ్మణ సమాజం ఐక్యతతో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.