తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో వర్షాలు

16-09-2026 | 12:17pm

హైదరాబాద్, సెప్టెంబర్ 16,(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గతంతో పోలిస్తే రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సుమారు 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మరో ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీలోనూ వర్షాలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే సముద్రంలో అలజడి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, రాబోయే రోజుల్లోనూ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. వర్షాలతో పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు