విమానంలో గందరగోళం.. టేకాఫ్ అవ్వగానే ఊడిన టైర్
మషద్ : ఇరాన్‌లోని మషద్ నుండి కెర్మాన్‌షాకు వెళ్తున్న సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్(Sepehran Airlines Boeing) 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలోని ప్రయాణికులు తమ భయానక అనుభవాన్ని వీడియోలో రికార్డు చేశారు. విమానం ల్యాండింగ్ గేర్ నుండి ఒక టైర్ ఊడిపోవడంతో ఆ విమానం మషద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్ నుంచి భారీ శబ్దాలు వినిపించాయని ప్రయాణికులు తెలిపారు.
ప్రయాణికుల లగేజ్ క్యాబిన్(Luggage cabin) తెరుకుని విమానం లోపల గందరగోళం నెలకొంది. వీడియోలో కనిపించినట్లుగా, విమానం తీవ్రంగా ఊగుతుండగా క్యాబిన్ పైకప్పులోని ఒక భాగం ప్రయాణికులపై పడింది. విమానం రన్‌వేపై ముందుకు వెళ్తుండగా, 737 విమానం పైకప్పులోని లైనింగ్ సీట్లలో ఉన్న ప్రయాణికులపై పడింది. ప్రయాణికులు భయంతో కేకలు వేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు, విమానం పూర్తిగా ఆగిన తర్వాత, ప్రయాణీకులందరినీ, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.