న్యాయవాదులు, జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవికుమార్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో న్యాయవాదులు(Lawyers), జర్నలిస్టుల(Journalists)పై జరుగుతున్న దాడులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ... ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, అధికారులను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు, ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆయన అన్నారు.
జిల్లాలో అధికార దురహంకారంతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నించడం సరైన విధానం కాదని, ప్రజాప్రతినిధులు అధికారాన్ని ప్రజాసేవ కోసం వినియోగించాలే తప్ప వ్యక్తిగత కక్షలు, బెదిరింపులు, దాడులకు పాల్పడేందుకు కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, బాధ్యులెవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణించి బాధితులకు తగిన రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.