కేంద్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే వైదొలగాలి

24-10-2026 | 07:59pm

బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులివ్వాలి.

సాదిక్ ఫౌండేషన్ ప్రతినిధి సాదిక్ అలీ

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Chief Election Commissioner of India, Gyanesh Kumar) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, విద్యారంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని సాదిక్ ఫౌండేషన్ ప్రతినిధి సాదిక్ అలీ(Sadiq Ali) డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సాదిక్ ఫౌండేషన్(Sadiq Foundation) చేపట్టిన ప్రజా యాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఘన స్వాగతం పలికింది.

అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కే షాహిద్ అధ్యక్షతన ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యారంగ సమస్యలపై విద్యార్థులతో భారీ ప్రదర్శన  నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిక్ అలీ మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కు పరిరక్షణ అత్యంత కీలకమని, ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లను తొలగించారన్న ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ఈసీ విఫలమైందన్నారు.

విద్యకు పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని, నిధుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కే షాహిద్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రజాస్వామ్య మనుగడ ఓటు హక్కు పరిరక్షణతో ముడిపడి ఉన్నాయన్నారు.

ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై ఎన్నికల సంఘం జవాబుదారీతనంతో వ్యవహరించి పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మల్లెల రామనాధం, తెలంగాణ జన సమితి నాయకులు దేవదానం, నభి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు