వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన సర్పంచ్
దమ్మపేట, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావులు వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) తో చేసిన విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుందని, మట్టి విగ్రహాలు నీటిలో వేగంగా, సహజంగా కరిగిపోతాయని తెలిపారు. మట్టి విగ్రహాలలో రసాయన రంగులు, విషపూరిత పదార్థాలు లేకపోవడం వల్ల చెరువులు, నదులలోని చేపలు, ఇతర జీవరాశులకు ప్రాణాపాయం ఉండదని అన్నారు.
మట్టి విగ్రహాలను ఇంట్లోనే బకెట్ లేదా తొట్టెలో నీటిని నింపి ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, నిమజ్జన ఊరేగింపుల్లో రద్దీ తగ్గుతుందని తెలిపారు. విగ్రహం కరిగిన తర్వాత ఆ మట్టిని, నీటిని ఇంటి మొక్కలకు లేదా పూల కుండీలకు ఎరువుగా వాడుకోవచ్చన్నారు. సీడ్ గణపతి అయితే ఆ మట్టి నుంచే మొక్క మొలకెత్తుతుందని తెలిపారు.
సహజ సిద్ధమైన బంకమట్టి, పసుపు, కుంకుమ వంటి వాటిని వాడటం వల్ల చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు వుండవన్నారు. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి నలుగు పిండితో (మట్టి రూపం) వినాయకుడిని తయారుచేసిందని, కాబట్టి మట్టి విగ్రహాన్ని పూజించడమే శాస్త్రోక్తం, సాంప్రదాయమని తెలిపారు. మట్టి విగ్రహాలను కొనుగోలు చేయడం వల్ల స్థానిక కుమ్మరులకు, కళాకారులకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందన్నారు. ఈ వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలు ఆనందోత్సవంతో, భక్తిభావంతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.