వృద్ధులపై ప్రేమ.. సుధారాణి సేవా కార్యక్రమం!
దమ్మపేట, నవంబర్ 14 (విజయక్రాంతి): చలికాలంలో వృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్(Sudha Herbal Trust) ఫౌండర్ కొనకళ్ల సుధారాణి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట(Dhammapeta) మండలం నల్లివారిగూడెం గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 16 మంది పేద వృద్ధులకు స్వెటర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ అటవీ ప్రాంత గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోందని, వృద్ధులకు శరీర వెచ్చదనం ఎంతో అవసరమని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని పేద వృద్ధులకు స్వెటర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
చలికాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నందున వృద్ధులను వారి పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. గతంలోనూ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో స్వెటర్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. సేవా కార్యక్రమం చేపట్టిన సుధారాణికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.