అండాల దందాలో మరో ఐదు కేసులు.. హైదరాబాద్‌లో కలకలం!

14-11-2026 | 11:03am

హైదరాబాద్‌లో వెలుగుచూసిన అండాల సేకరణ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అండాలను సేకరిస్తున్న వ్యవహారంలో పోలీసులు మరో ఐదు కేసులు నమోదు చేశారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్స్ (Oasis Fertility Clinics) నిర్వాహకులపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల (DMHO) ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మియాపూర్, మహంకాళి, మలక్‌పేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలకు చెందిన మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మహిళలను నగరానికి రప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో మహిళకు రూ.30 వేల వరకు డబ్బు ఆశ చూపించి అండాల దానానికి (Egg Donation) ఒప్పించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఫెసిలిటేటర్లకు ఒక్కో మహిళను తీసుకొచ్చినందుకు రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, అండాల సేకరణ ప్రక్రియలో మహిళల ఆరోగ్య భద్రతను పట్టించుకోలేదనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు (Hormone Injections) ఇచ్చినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అండాల సంఖ్య, నాణ్యత ఆధారంగా ఫెసిలిటేటర్లకు చెల్లింపులు చేసేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో అండాల సంఖ్య, నాణ్యత లేకపోతే వారికి చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం కోత విధించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై ఇప్పటికే మల్కాజ్‌గిరి పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో ఐదు కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత విస్తృతమైంది. మహిళలను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన విధానం, అండాల సేకరణ వెనుక ఉన్న వ్యక్తులు, క్లినిక్‌ల నిర్వాహకుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు