రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలను ప్రారంభించిన ఎస్పీ
పోటీలను ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు..
చర్ల, నవంబర్ 23, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూజారిగూడెం శివార్లలో సోమవారం నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా అండర్-17 బాలుర రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల(State Level Volleyball Tournament)ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్-17 బాలుర జట్లు పాల్గొంటున్నాయి.
అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, అవసరమైన సదుపాయాలు కల్పిస్తే క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (SCA) నిధుల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.75 లక్షల వ్యయంతో పూజారిగూడెం శివార్లలో ఈ క్రీడా మైదానాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖతో పాటు స్థానిక ప్రజలు, కాంట్రాక్టర్ల సహకారంతో ఈ మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మైదానం నిర్మాణం పూర్తయిన అనంతరం తొలిసారిగా సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వేదికగా నిలవడం సంతోషకరమని తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత విద్య, క్రీడలు, ఉద్యోగాలు తదితర అన్ని రంగాల్లో రాణించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, క్రీడా నిర్వాహకులు, కోచ్లు పాల్గొన్నారు.