నేడు బీఆర్‌ఎస్ దీక్షా దివస్
- అలుగునూరులో స్ఫూర్తి సభ
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు
- తరలిరానున్న కార్యకర్తలు, ప్రజలు
- భారీ ఏర్పాట్లు చేసిన బీఆర్‌ఎస్ నేతలు
కరీంనగర్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన(Telangana State Achievement) ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి దీక్షా దివస్‌ను ప్రతీకగా నిలిపేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభను కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయడంతో పాటు రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాట స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పేలా ఈ సభను నిర్వహిస్తున్నారు. దీక్షా దివస్ స్ఫూర్తి సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది.
2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం గా నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు అంశం దశాబ్దాలుగా రాజకీయ పార్టీల మధ్య నలుగుతూ, ఎన్నికల సమయంలో హా మీలకు పరిమితమవుతూ రావడంతో ఈ పరిస్థితికి ముగింపు పలికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన కేసీఆర్‌ను అలుగునూరు వద్ద అరెస్టు చేయడంతో తెలంగాణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ రోజు నుంచి అలుగునూరు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా నిలిచిపోయింది. కేసీఆర్ దీక్ష తో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మ హిళలు, కార్మికులు, కవులు, కళాకారులు, మేధావులు సమాజంలోని అన్ని వర్గాలు ఉద్యమంలో భాగస్వాములవడంతో చివర కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఆ దీక్ష చారిత్రాత్మక మలుపుగా నిలిచింది.
ఆదివా రం దీక్షా దివస్ కార్యక్రమం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇది కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సభ అని నాయకులు స్పష్టం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అలుగునూరులో ఏర్పాట్లను మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుం ట్ల సంజయ్, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పర్యవేక్షించారు.
భారీగా ఏర్పాట్లు
సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 35 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రాంతాల వారీగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వాహనాల రాకపోకలను క్రమ బద్ధీకరించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పా టు చేసి, వలంటీర్లను సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజలకు మంచినీరు, కూర్చునే సదుపాయం, ఇతర మౌలిక వసతులు కల్పిం చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.