నాలుగేళ్ల లవ్ స్టోరీకి పెళ్లిరోజే ఎండ్ కార్డ్!
తమిళనాడు: నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి, ఎన్నో అడ్డంకులను అధిగమించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కానీ వారి వైవాహిక జీవితం మొదటి రోజే ఊహించని మలుపు తిరిగింది. రిసెప్షన్ (Reception) వేడుకలో వరుడు మద్యం మత్తులో గొడవకు దిగడంతో ఉదయం పెళ్లి చేసుకున్న జంట సాయంత్రానికే విడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో కలకలం రేపింది.
కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ సమీపంలోని రీతాపురం గ్రామానికి చెందిన రూబెన్ (31) సైన్యంలో పనిచేస్తున్నాడు. కేరళ సరిహద్దులోని పారసాల సమీప గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతితో అతడికి నాలుగేళ్లుగా ప్రేమ సంబంధం ఉంది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ (Pharmacist)గా పనిచేస్తున్న యువతిని వివాహం చేసుకునేందుకు రూబెన్ ప్రయత్నించాడు. తొలుత యువతి కుటుంబం అభ్యంతరం తెలిపినా, చివరకు ఇరువైపుల పెద్దలు అంగీకరించారు. దీంతో అక్టోబర్ 12న పారసాలలో వీరి వివాహం జరిగింది. అదే రోజు సాయంత్రం రూబెన్ స్వగ్రామమైన రీతాపురంలోని ఓ కల్యాణ మండపంలో విందు ఏర్పాటు చేశారు.
మద్యం మత్తులో గొడవ
విందు జరుగుతున్న సమయంలో రూబెన్ మద్యం సేవించి తూలుతూ కనిపించడంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అల్లుడి పరిస్థితిని గమనించిన మామ ఈ విషయాన్ని కుమార్తెకు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన రూబెన్ మామను దూషించి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపైనా చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో వేడుకలో గందరగోళం నెలకొంది. అనంతరం రూబెన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయపడిన వధువు, ఆమె తండ్రి కుళచ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
చికిత్స అనంతరం బాధితులు కుళచ్చల్ పోలీస్ స్టేషన్ (Police Station)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రూబెన్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు, అదే రాత్రి వధువు తన తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన జంట మధ్య పెళ్లైన రోజే వివాదం తలెత్తడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసుల దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.