అబ్దుల్ కలాంకు సీఎం నివాళి!
హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన కలాం.. నిరాడంబర జీవనం, అంకితభావంతో ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, లక్ష్య సాధన దిశగా ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చిన మహనీయుడని గుర్తుచేశారు.
భారత రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రసాంకేతిక అభివృద్ధికి కలాం చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. కలాం ఇచ్చిన “కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయండి” అనే సందేశం నేటికీ లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తోందని సీఎం వెల్లడించారు.