విజయవాడకు రాష్ట్రపతి ముర్ము
విజయవాడ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) గురువారం విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని పున్నమిఘాట్లో నిర్వహించే సరస్ మేళాను (Saras Mela) ఆమె ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సరస్ మేళా ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రపతి స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళలతో సమావేశం అనంతరం ఆమె విజయవాడ పర్యటన ముగియనుంది.
అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రత, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు.