గోల్డ్ లోన్ 'మహా కుంభకోణం'

19-09-2026 | 08:17am

కుంభకోణం.. బ్యాంకు వర్గాల్లో తీవ్ర కలకలం!

ఖాతాదారులకు తెలియకుండానే కోట్లల్లో దందా.. బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!

శ్రీరామ్, ముత్తూట్ సంస్థల పేర్లతో గోల్డ్ అడ్జస్ట్‌మెంట్ అక్రమాలు?

ఖాతాదారుల అసహనం.. బయటపడ్డ అక్రమార్కుల నెట్‌వర్క్!

అశ్వరావుపేట, (విజయక్రాంతి): అశ్వారావుపేట మండల కేంద్రంలో అత్యంత సంచలనాత్మకమైన గోల్డ్ లోన్ మహా కుంభకోణం(Gold Loan Scam) వెలుగులోకి వచ్చింది. స్థానిక బ్యాంకు వేదికగా ఏకంగా రూ. 3 కోట్ల మేర గోల్డ్ లోన్ అక్రమాలు జరిగినట్లు తేలడంతో స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. నమ్మకంతో బ్యాంకు మెట్లెక్కిన ఖాతాదారులకు షాక్ ఇస్తూ, వారి వెనుక పెద్ద ఎత్తున దందా నడిపిన తీరు ఇప్పుడు మండల వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

బ్యాంకు ఉద్యోగి హస్తం.. ఒకరి పేరుపై మరొకరికి లోన్లు!

బ్యాంకులోని ఓ సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమ సామ్రాజ్యం నడిచినట్లు తెలుస్తోంది. అసలైన ఖాతాదారులకు ఏమాత్రం సమాచారం లేకుండా, ఒకరి పేరిట ఉన్న బంగారాన్ని(Gold) మరొకరి పేరు మీద మళ్లించి, నకిలీ వివరాలతో రూ. 3 కోట్ల భారీ మొత్తాన్ని గోల్డ్ లోన్ల రూపంలో కొల్లగొట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలు కేవలం ఒక్క బ్యాంకుకే పరిమితం కాకుండా శ్రీరామ్ ఫైనాన్స్(Shriram Finance), ముత్తూట్ వంటి ఇతర ప్రముఖ ఆర్థిక సంస్థలతో కూడా లింక్ అయి ఉన్నాయనే దిగ్భ్రాంతికర అంశాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటీపీలు లేకుండానే వ్యవహారం.. గోల్డ్ షాపుల యజమానుల పాత్ర?

సాధారణంగా గోల్డ్ లోన్ మంజూరు(Gold Loan Sanction) కావాలంటే ఖాతాదారుడి భౌతిక సమక్షం, మొబైల్ ఓటీపీలు అత్యంత కీలకం. అయితే, ఇవేమీ లేకుండానే లోపల ఉన్న సిబ్బంది అండదండలతో, గోల్డ్ షాపుల యజమానుల వద్ద ఉన్న బంగారాన్ని ఇతర పేర్లపై మళ్లించి కోట్ల రూపాయల లోన్లు మంజూరు చేయడం వెనుక పెద్ద నెట్‌వర్కే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బ్యాంకు వద్ద ఉద్రిక్తత.. సమగ్ర విచారణకు బాధితుల డిమాండ్!

ఈ వ్యవహారం కాస్త బయటకు పొక్కడంతో బాధితులు, స్థానిక పత్రికా విలేకరులు(Press reporters) పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో బ్యాంకు సిబ్బంది తమ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ రూ. 3 కోట్ల భారీ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇంకా ఎంతమంది పాత్ర ఉందనే దానిపై నిష్పాక్షిక విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు