కుటుంబ కలహాలే కానీ.. ప్రాణాలకు లెక్కలేదా?

13-10-2026 | 10:48am

ఏటూరునాగారం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, అత్త, కుమారుడిపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేయడంతో గ్రామంలో కలకలం రేగింది. బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

ఒక్కసారిగా లేచి దాడి

వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరి చంద్రప్రసాద్ తన తల్లి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం తన అత్తగారి ఊరైన రొయ్యూరుకు వచ్చాడు. అక్కడ భార్య, పిల్లలతో కలిసి భోజనం చేసి మంచంపై పడుకున్నాడు. ఈ క్రమంలో దుర్గం రామక్క ఇంటికి వచ్చి మాట్లాడుతుండగా, మంచంపై ఉన్న చంద్రప్రసాద్ ఒక్కసారిగా లేచి భార్య, అత్త, కుమారుడిపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు.

నిందితుడిని పట్టుకున్న స్థానికులు

దాడితో బాధితులు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కళ్లలో ఇసుక చల్లి, చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఆసుపత్రికి బాధితులు

సమాచారం అందుకున్న ఏటూరునాగారం ఎస్సై మహేష్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ జరిపి నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరిన్ని వార్తలు