ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడి దుర్మరణం
టేకులపల్లి (విజయక్రాంతి): ఇసుక ట్రాక్టర్ ప్రమాదం ఓ నిరుపేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబానికి అండగా నిలిచిన యువకుడు ట్రాక్టర్ బోల్తాపడి మృత్యువాత పడటంతో భార్య, ఐదేళ్ల కుమార్తె దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు భార్య తొమ్మిది నెలల గర్భిణీ కావడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని చర్లపల్లిలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. చర్లపల్లికి చెందిన మధు ఇసుక ట్రాక్టర్‌పై సంపత్‌నగర్ నుంచి టేకులపల్లి వైపు వచ్చి తిరిగి వెళ్తుండగా గురువారం రాత్రి రోడ్డు గుంపు సమీపంలో ట్రాక్టర్ (Tractor) అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ మధుపై పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న బోడు పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజమౌళి తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లపై నిఘా ఏదీ?
మండలంలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు, వాటి వేగంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక ట్రాక్టర్ల రాకపోకలపై నిఘా (Monitoring) పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తొమ్మిది నెలల గర్భిణీ ప్రియతో పాటు ఐదేళ్ల చిన్నారిని ప్రభుత్వం ఆర్థిక సహాయం (Financial Assistance) అందించి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.