సీఎం వ్యాఖ్యలతో రగిలిన రాజగోపాల్‌రెడ్డి

20-11-2026 | 01:50pm

రేవంత్‌ వ్యాఖ్యలకు రాజగోపాల్‌రెడ్డి కౌంటర్.. గుండెపై చేయి వేసుకుని చెప్పాలంటూ సవాల్!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy Counter Comments) చేసిన ఘాటు వ్యాఖ్యలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy Comments) అదే స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన సాగుతోందా? అని సీఎంను సూటిగా ప్రశ్నించారు. గుండెపై చేయి వేసుకుని సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీలో మరోసారి Political Heat పెరిగింది. కొడంగల్‌తో పాటు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాను ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి సీఎంకు వివరించానని చెప్పారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతోనే బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పాలనపై తానే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అహంకారాన్ని పక్కనపెట్టి నిజాయితీతో పాలన సాగించాలని హితవు పలికారు. గత మూడేళ్లుగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారు? అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో ఉండి దొంగలకు, పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించకూడదంటూ ఘాటు విమర్శలు చేశారు.

నిధుల కేటాయింపుపైనే అసలు వివాదం!

తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిధులు అడగడం లేదని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌కు నిధులు కేటాయించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌, మధిర, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాలను కూడా పట్టించుకోవాలని గతంలో ఆయన విమర్శించారు. మునుగోడులో నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఈ అంశంపై పలుమార్లు సీఎంను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేలపై రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

మరోవైపు, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కొందరు కాంగ్రెస్‌ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి అంతకుముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శించే కొందరు నేతలు.. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తున్నారని అన్నారు. చెడు విషయాలను వ్యక్తిగతంగా చెప్పాలని, మంచి విషయాలను బహిరంగంగా ప్రశంసించాలని సూచించారు. అయితే కొందరు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించే అలాంటి వారిని కాంగ్రెస్‌ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రాజగోపాల్‌రెడ్డి స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సీఎం, సొంత పార్టీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


మరిన్ని వార్తలు