రేఖా నాయక్ ఇంటి వద్ద హైటెన్షన్.. ఏ క్షణమైనా అరెస్ట్?
మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏం జరుగుతోంది?.. పోలీసుల మోహరింపుతో కలకలం!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఒక్కసారిగా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్(Former MLA Ajmeera Rekha Naik) నివాసం వద్ద ఎన్ఫోర్స్మెంట్, పోలీసు అధికారులు చేరుకోవడం కలకలం రేపుతోంది. రైస్ మిల్లుల అక్రమాల వ్యవహారంలో ఆమెను అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఖానాపూర్‌లో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది.
అందిన సమాచారం ప్రకారం.. ఖానాపూర్ పట్టణంలోని రేఖా నాయక్ ఇంటికి Enforcement, Police అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఆమెతో అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రైస్ మిల్లులకు సంబంధించిన అక్రమాల కేసులో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే అరెస్టుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు రేఖా నాయక్ నివాసం సమీపంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడికి మీడియాను అనుమతించడం లేదు. ఇంటి వద్దకు చేరుకున్న అధికారుల చర్యలు, లోపల జరుగుతున్న చర్చలపై స్పష్టత లేకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే రేఖా నాయక్‌కు సంబంధించిన రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం, Custom Milling Rice (CMR) వ్యవహారంపై అక్రమాల ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నివాసం వద్దకు ఎన్ఫోర్స్మెంట్, పోలీసు అధికారులు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.