ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ పోడ్ కార్లు
హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు భవిష్యత్తులో ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితులకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. డ్రైవర్ అవసరం లేకుండా నడిచే అత్యాధునిక ఎలక్ట్రిక్ పోడ్ కార్ల (Electric Pod Cars)ను నగరంలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (Personal Rapid Transit - PRTS) పేరుతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని యోచిస్తోంది.
మెట్రో రైళ్లలో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు స్టేషన్ నుంచి కార్యాలయాలకు చేరుకునే చివరి దశ ప్రయాణ సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందుకోసం చిన్న చిన్న ఎలక్ట్రిక్ పోడ్ కార్లను ప్రత్యేక మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ (HMRL) ఇప్పటికే సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని (Feasibility Study) ప్రారంభించింది.
తొలి దశలో కూకట్పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర పోడ్ కార్ల మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ కారిడార్‌లో మొత్తం 64 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా ఈ మార్గం సాగనుంది. ఇది అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల ప్రయాణం మరింత సులభతరం అయ్యే అవకాశం ఉంది.
కేవలం ఐటీ కారిడార్‌కే పరిమితం కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాలకూ ఈ రవాణా వ్యవస్థను విస్తరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎల్బీ స్టేడియం నుంచి రాణిగంజ్ వరకు, అసెంబ్లీ నుంచి బేగంపేట వరకు పోడ్ కార్ల మార్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.ఈ ప్రాజెక్టు (Transport Project) కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. మెట్రో, పోడ్ కార్ల అనుసంధానంతో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన, సాధ్యాసాధ్యాల అధ్యయన దశలోనే ఉంది. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం, అమలు గడువులు వెల్లడికావాల్సి ఉంది.