పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా

20-11-2026 | 02:52pm

గణపురం, నవంబర్ 20 (విజయక్రాంతి): పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా (Life Insurance Security) కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Life Insurance Scheme) లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిస్తున్న పథకం దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు (Online Registration) ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తుల నమోదు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ అడ్డూరి రాజేశ్వరరావు, ఎంపీడీవో లంకెపల్లి భాస్కర్, స్థానిక సర్పంచ్ కావటి రజిత రవీందర్, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు