రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలి
మార్కెట్ యార్డు అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలి: ఎమ్మెల్యే పాయం
బూర్గంపాడు,(విజయక్రాంతి): రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డు అభివృద్ధికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు(Pinapaka MLA Payam Venkateswarlu) సూచించారు. శుక్రవారం బూర్గంపాడు మార్కెట్ యార్డు(Market yard development)లో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణి, వైస్ చైర్మన్ కాకా రాములు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు(Farmers) పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని, మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నూతన పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
నూతన పాలకవర్గంలో చైర్మన్గా తోలెం కళ్యాణి, వైస్ చైర్మన్గా కాకా రాములు, డైరెక్టర్లుగా లోడిగ సత్యనారాయణ, పాల్వంచ శ్రీను, యెనిక మంగమ్మ, సోడే వెంకటేశ్వర్లు, ధరావత్ లలిత, యడుల్ల యేసు, పునెం శ్యామ్ కుమారి, గొగ్గెల రవి, భూక్య సేవాలాల్, మడకం నాగమణి, ట్రేడర్ ప్రతినిధులుగా తాటి మౌనిక, తెల్లం వీరభద్రం బాధ్యతలు స్వీకరించారు.కార్యక్రమంలో పీఏసీఎస్ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఏడు మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.