బడుగుల గళం బోయ జంగయ్య

12-10-2026 | 05:05am

సమాజంలో పేద, దళిత, అట్టడుగు ప్రజల జీవితాలలోని దయనీయతను, వెనుకబాటుతనా న్ని, ఎదుర్కొన్న అసమానతలను అక్షరబద్ధం చేసిన రచయిత బోయ జంగయ్య. దళితులు, బడుగు వర్గాల సమస్యలను తన రచనలలో స్పష్టమైన దక్కోణంతో ప్రతిబింబింపజేసి చైతన్యం రగిల్చేందుకు ఆయన రచనలు ఎంతగానో దోహదపడ్డాయి.

వర్తమాన ప్రపంచం లోని మనిషి జీవితాన్ని ఆలంబనగా చేసుకుని అంతరాలను ఎత్తిచూసి సమస్యలపై పోరాటపు శంఖం పూరిం చిన రచయితగా ఆయన పేరొందారు. సమాజంలోని కొంత మందికే ఎదురవుతున్న కష్టాలు, అసమానతలు ఆయనను కలచివేశాయి. 1942 అక్టోబర్ 1న నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా పతంగి గ్రామంలో మల్లయ్య, ఎల్లమ్మ దంపతులకు జంగయ్య జన్మించారు.

నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన తన చుట్టూరా ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని సామాజిక అంతరాల పట్ల ఆవేదన చెందారు. చిన్నప్పటి నుంచే ఏ విష యానికైనా వెనువెంటనే స్పందించే గుణం కలిగిన జంగయ్యకు సాహిత్యం, కళలు అంటే ఎనలేని ఆసక్తి సహజం గానే ఏర్పడింది. రచనలతో చైతన్యాన్ని రగిల్చి పరిష్కారా న్ని తీసుకురావాలన్న పట్టుదలతో సాహిత్య వ్యాసం గాన్ని ప్రారంభించారు.

1964 నుంచి జంగయ్య రచనలు చేయడం ప్రారంభించారు. ‘జీవితపు మలుపులు’ అన్న కథతో జంగయ్య కథా రచన ప్రారంభమైంది. కూలీపని చేసుకునే తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడే జంగయ్యను బడిలో చేర్పించారు. నాలుగో తరగతి చదివే రోజుల్లోనే జంగయ్య వివక్షతను ఎదుర్కొన్నారు.

కష్టసుఖాల కలబోతగా బోయ జంగయ్య రచనలు కన్పిస్తాయి. నిజజీవితం ప్రవాహమై పారిన తీరు రచనల్లో దృశ్యమానమవుతుంది. సమాజ అసమానతలు, అంతరాలు తేటతెల్లమవుతాయి. జంగయ్య రాసిన నాటికల్లో కష్టసుఖాలు (1963), దేశం కోసం (1965), కొత్త బాటలు (1980),ఆలోచించండి (2011) పేర్కొనదగినవి.

ఎన్నో సామాజిక, మానవీయ అంశాలను ఈ నాటికల ద్వారా జంగయ్య వెల్లడించారు. సామాజిక భూమికలతో ఎన్నో కథలు రాసి ఆలోచింపజేసిన ఉత్తమ కథా రచయితగా ఆయన పేరొందారు. లోకం(1973), చీమలు (1996), తెలంగాణ వెతలు (1998), బోజ కథలు (2000), బొమ్మలు(2002), ఉప్పునీరు(2002), ఇప్పపూలు (2003), ఆమె (2004) వంటి కథా సంకలనా లను జంగయ్య ప్రచురించారు.

లోకాన్ని నిశిత దృష్టితో పరిశీలించిన కవిగా అనేక కవితలను ఆయన రచించారు. నడుస్తున్న చరిత్ర (1976), వెలుతురు (1984), బోజకవితలు (2002), పంచనామ (2009) అన్న ప్రసిద్ధ కవి తా సంపుటులను వెలువరించి కవిగా తన స్థానాన్ని సుస్థి రం చేసుకున్నారు. బాలసాహిత్యమంటే కూడా ఎంతో ఇష్టపడే జంగయ్య పిల్లల కోసం వివిధ సందర్భాల్లో అనే క కథలను రాశారు.

బడిలో చెప్పని పాఠాలు (1998), కొత్త పాఠాలు (1999), గుజ్జనగూళ్లు (1999), ఆటలు పాటలు (1999), మాటలు ఆటలు (2002), చిలకల పలుకులు (2003), మన నేతలు (2004), టీవీ ముచ్చట్లు (2001) అన్న పుస్తకాలను బాలల కోసం ప్రచురించారు.

మహనీయుల జీవిత చరిత్రలను కూడా ఆయన రాసి వారి జీవితాలలోని విభిన్న నూతన దృక్కోణాలను ఆవిష్కరించారు. డా.అంబేద్కర్ (బాల్యం విద్యభ్యాసం),  బాబూ జగ్జీవన్‌రామ్ (1987), కె.ఆర్. నారాయణన్ (1998), గుర్రం జాషువా (1998) తదితరుల జీవిత చరిత్రలను రచించారు.  జంగయ్య రచనలకు విశ్వవిద్యాల యాల స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

జాతర (1988), జగడం (2003), పుట్టుమచ్చ (2011) అన్న నవలలు ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. ‘జాతర’ నవలను మైసూర్ విశ్వవిద్యాలయం వారు 1995లో బి.ఎడ్ కు ఉపవాచకంగా నిర్ణయించారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు ‘జగడం’ నవలని ఎం.ఏ తెలుగు విద్యార్థులకు ఉపవాచకంగా పెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు ‘గొర్రెలు’ నవలను ఎంఏ తెలుగు విద్యార్థులకు ఉపవాచంగా చేర్చారు. జంగయ్య రచించిన ‘డాక్టర్ అంబేద్కర్’ వచన కవితను 8వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు.

నిరంతర సాహితీ ప్రయాణం చేసిన జంగయ్య తెలుగు సభల్లో పాల్గొనేందుకు దేశవిదేశాలను సందర్శించారు. ప్రపంద రెండవ తెలుగు మహాసభలు - 1981, మలేషియా ప్రపంచ పదో తెలుగు మహాసభలు -1990, బెంగుళూరు కథా సదస్సు -1991, చెన్నై దళిత సాహిత్య అకాడమీ సదస్సు -1993, న్యూఢిల్లీ, దళిత సాహిత్య సభలు - హైదరాబాదు, రాజస్థాన్‌లో సాంస్కృతిక, సాహి త్య పర్యటన,

తెలుగు కవి హటరీదాలో - 1994 కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో, అఖిల భారత అభ్యుదయ రచయితల సదస్సు 2003 హైదరాబాద్, ప్రపంచ తెలుగు మన సభలు విజయవాడ -2009, ఎన్ బిటిఐ న్యూఢిల్లీ కథా సదస్సులో ప్రసంగం -2010, యూఎస్‌ఏ కాలిఫోర్నియా కథా సదస్సులో ప్రసంగం - 2010, తెలు గు దళిత కథపై సాహిత్య అకాడమీ ప్రసంగం - 2010 మొదలైన సమావేశాలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

సాహిత్య సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగిన సాహితీవేత్త జంగయ్య. నల్లగొండ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, నల్లగొండ విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శిగా, నల్లగొండ సాహితీమిత్రుల సంస్థ అధ్యక్షులుగా బహుముఖ సాహిత్య సేవలను అందించారు. సాహిత్యాన్నే తన ఊపిరిగా మార్చుకొని ఎన్నో విలువైన రచనలను అందించిన జంగయ్యను పలు సంస్థలు అవార్డులు,

పురస్కారాలతో గౌరవించాయి. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం 1984లో ఆయన ‘ఎచ్చరిక’ కథా సంపుటానికి శ్రీశ్రీ మెమోరియల్ బంగారు పతకాన్ని అందజేసి సన్మానించింది. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం 1989లో ‘జాతర’కు ఉత్తమ నవల అవార్డుతో గౌరవించింది. దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారి డా.అంబేద్కర్ ఫెలోషిప్‌ను జంగయ్య 1994లోనే పొందారు.

1999లో విజయనగరానికి చెందిన చాసో స్ఫూర్తి అవార్డు పొందారు. 1991లో కాకినాడలో స్వరాజ్యలక్ష్మి అవార్డు, 1999లో కరీంనగర్ లో మలయశ్రీ అవార్డు, 2001లో పాణిపట్టు హర్యానాకు చెందిన పద్మశ్రీ డా లక్ష్మీనారాయణ దూబే మెమోరియల్ అవార్డు, జగిత్యాల విశాల సాహితీ పురస్కారం, 2002 తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా అవార్డు, 2003లో తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. సాహిత్యాన్ని తమ రచనల ద్వారా ముందుకు నడిపించే రీతిలో శాస్త్రీయ, అభివృద్ధి దృక్పథాలతో ఉండాలని జంగయ్య కోరుకున్నారు.

మూడ నమ్మకాలను తొలగించి దళిత, బలహీన,గిరిజన వర్గాల సమగ్రాభివృద్ధికి తోడ్పడే దిశగా ముందుకు సాగాలన్నది జంగయ్య అభిమతం. అజ్ఞానం అనాగరికత, సంప్రదాయాల మాటున మనిషి నలిగిపోకుండా చూడాలని చెప్పారు. జీవితాన్ని ప్రేమించేతత్వం అవసరమని తన రచనల్లో పలుచోట్ల సూచించారు. మానవత్వంతో యోచించే జ్ఞానం పొంది అన్యాయానికి ఎదురు నిలబడే శక్తిని సాధించాలన్నారు.

ఊహించని రీతిలో మనుషుల మధ్య పేరుకుపోయిన అసమానతలను నియంత్రించి లౌకిక విజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యం జంగయ్య కథల్లో అడుగడుగునా కన్పిస్తుంది. సామాజికత బాటన సాహిత్య స్పృను కలిగి అనేక దార్శనిక అంశాలు ప్రతిబింబించేలా తన రచనలను మలచిన రూపశిల్పి జంగయ్య. ‘అడవి పూలు’  కథ ఎంతో మం దిని కదిలించి ఆలోచింపజేసింది. గిరిజన బిడ్డల ఆకలి చావులలోని దయనీయత, అట్టడుగు వర్గాల కష్టాలను, కన్నీళ్లను చిత్రించి చూపించారు.

సమాజంలో అసమానత, నిర్లక్ష్యవైఖరి వల్ల అట్టడుగు ప్రజలకు, ముఖ్యం గా దళిత వర్గాలకు ఫలితాలు అందకపోగా మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతున్న స్థితిని ‘ఎచ్చరిక’ వంటి కథల్లో స్ప ష్టం చేశారు. అంటరానితనాన్ని సామాజిక దుస్ధితిగా చెప్పి ఉనికి, అస్తిత్వం కాపాడుకోవాలన్న చైతన్య సందేశాన్ని ‘గ్రహణం’ కథ ద్వారా అందించారు. నిజాం రాజుల పాలనలో పనిచేసిన అధికారుల దౌర్జన్యాలను నిరసిస్తూ రాసిన ‘కొడవలందుకుంది కథ’ అన్యాయాన్ని పాతరేసి ఎదురు తిరిగిన తనానికి ప్రతిబింబంగా నిలిచింది.

‘భుక్తికోసం’ కథ దొర ఆధిపత్యాన్ని ఎదిరించిన తెలంగాణ వీరవనిత సాహసాన్ని చిత్రించింది. అజ్ఞానాన్ని పెంచి పోషించి దౌర్జన్యంతో తమ పబ్బం గడుపు కునే తత్వాన్ని, దుష్టనీతిని నిలేసి ప్రశ్నించే స్థితిని జంగ య్య రాసిన ‘శిథిల విగ్రహాల కథ’ చెప్పింది. ‘గ్రహణం’ కథలో రాజాం, భుక్తికోసం కథలో రామక్క,

‘శిథిల విగ్రహాలు కథ’లో గోపాల్, దళిత స్త్రీ జీవితాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చొద్దని సందేశమిచ్చే చైతన్యవంతమైన ‘గంగ’ వంటి పాత్రలను సృష్టించి అన్యాయంపై ఎదురు తిరిగేతత్వాన్ని ప్రదర్శించారు. ముప్ప, ఇప్పపూలు, బతుకమ్మ. పనిష్మెంట్, గద్దలు, ఎర వంటి ఎన్నో కథలు అసమానతలపై ఎగరేసిన పోరాటపు జెండాలుగా పాఠకులకు స్పూర్తినిస్తాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల జీవిత ఆచార సంప్రదాయాలకు అద్దంపడుతూ పలు నవలలను జంగ య్య రచించారు. గ్రామీణులు అమాయకుల వడంతో పూజారి వర్గదోపిడీకి ఎలా గురవుతున్నారో ‘జాతర’ నవ ల ద్వారా జంగయ్య వివరించారు. ‘మేళా’ పేరుతో ‘జాతర’ నవల హిందీలోకి కూడా అనువాదమై జంగయ్యకు ఎంతో పేరు తెచ్చింది.

‘జగడం’ నవల 1952 నుంచి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన అనేక సామాజిక మార్పులు, దళితుల ఆకాంక్షలను చిత్రించింది. అట్టడుగు వర్గాల విప్లవ చేతనకు ప్రతీకగా పేరొందిన జాతర నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా లభించింది. సామాజిక స్పహతో జంగయ్య రాసిన ‘పుట్టుమచ్చ’ నవల గొప్ప సందేశాన్ని అందించింది. 

1973 లో జంగయ్య రాసిన ‘ఆలోచించండి ‘నాటిక ఎయిడ్స్ సమస్య చిత్రణ నేపథ్యంతో కొనసాగింది. ప్రాణాంతక వ్యాధి పట్ల ఆలోచించాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తుచేసేందుకు ‘ఆలోచించండి’ అంటూ ఆనాడే జంగయ్య పేరు పెట్టారు.

సామాజిక అసమానతలను ప్రత్యక్షంగా చూస్తూ ప్రతిఘటనా ధోరణితో రచనా శంఖారావాన్ని పూరించి సాహిత్య రంగంలో కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, అనువాదకునిగా, మానవతావాదిగా గొప్ప సాహిత్యాన్ని జంగయ్య అందించారు. సందేశాత్మక రచనల్ని అందించిన దార్శనికునిగా తెలుగు సాహి త్య చరిత్రలో తెలంగాణ ప్రాం తపు రచనా శిఖరంగా నిలిచిపోతారు జంగయ్య. 7 మే 2016లో జంగయ్య కన్నుమూశారు. 

 వ్యాసకర్త సెల్ 9441464764


మరిన్ని వార్తలు