విచక్షణ, క్రమశిక్షణతోనే ఔన్నత్యం

25-11-2026 | 05:05am

పాలకుర్తి రామమూర్తి :

‘అక్షపటలమధ్యక్షః ప్రాఙ్ముఖమ్ ఉదఙ్ముఖం వా విభక్తోపస్థానం నిబంధపుస్తకస్థానం కారయేత్!’

(కౌటిలీయం - 2-7)

అక్షపటలం అంటే ఆదాయవ్యయాదులకూ, ఆయా వస్తువుల లెక్కలకు సంబంధించిన పుస్తకాలను భద్రపరచే కార్యాలయం. నిబంధపుస్తకాలు అనగా రిజిస్టర్లు. కార్యాలయ అధ్యక్షుడు(Office President) నిబంధపుస్తకాలను భద్రపరచే స్థానమైన అక్షపటలాన్ని వేరువేరుగా ఉన్న విశాలమైన గుర్తులతో  పూర్వాభిముఖంగా (తూర్పువైపుగా) కానీ, ఉత్తరాభిముఖంగా కానీ నిర్మింపచేయాలని అంటాడు ఆచార్య చాణక్య.

ఆదాయవ్యయాలకు సంబంధించిన అన్ని వివరాలను రిజిస్టర్లలో వివరంగా రాయించాలి. అలాగే వాటి నిబద్ధతను నిష్ణాతులైన గణకులచే తనఖీ చేయించాలి. తప్పులు కనిపించినా, అధికారులు కావాలని అక్రమాలకు పాల్పడినట్లు రుజువైనా వారిని తగిన రీతిలో శిక్షించాలి. అయితే ‘అపరాధం సహేతాల్పం తుష్యేదల్పేûపి చోదయే మహోపకారం చాధ్యక్షం ప్రగ్రహేణాభిపూజయేత్’... చేసే పనులలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు.

అవి కావాలని చేసిన పొరపాటు కానప్పుడు రాజు సహించాలి. అలాగే చిన్న అపరాధాలను మన్నించాలి. వసూళ్లలో ‘ఉదయం’ అనగా ఆదాయం తక్కువగా ఉన్నా సంతోషించాలి. రాజ్యానికి చాలా ఉపకారాలు చేస్తున్న అధ్యక్షుడిని తగిన రీతిగా సత్కరించి గౌరవించాలి. ఆ స్థానంలో అతనిని స్థిరంగా నియోగించాలని అంటాడు చాణక్య. 

‘క్రమావహీనమ్, ఉత్క్రమమ్, అవిజ్ఞాతమ్, పునరుక్తం వా వస్తుకమ్ అవలిఖితః ద్వాదశపణో దండః’ అంటాడు చాణక్య. నిబంధ పుస్తకాలలో సరైన క్రమంలేకుండా వస్తుకాన్ని(లెక్కలు) తప్పుగా రాసినా, రాయాల్సిన పద్ధతికి విరుద్ధంగా రాసినా, అస్పష్టంగా రాసినా, రాసినదే మళ్లీ మళ్లీ   రాసినా.. అలా రాసిన వానికి దండన విధించాలని చెపుతాడు చాణక్య. 

అసంకల్పితంగా దొర్లిన పొరపాట్లను భూతద్దంలో చూపి దండించడం వల్ల రాజు/ నాయకునిపై భయం పెరగవచ్చునేమో కానీ గౌరవం పెరగదు.. అధికారం ఉద్యోగిని నియంత్రించగలదు. ఆదరణ అతనిలోని సామర్థ్యాన్ని వెలికితీయగలదు. 

చాణక్య ఒకచోట.. చిన్న అపరాధాన్ని సహించాలని చెప్తాడు. మరొకచోట.. లెక్కల నమోదులోని నిర్దిష్ట లోపాలకు దండన విధించాలని చెప్తాడు.  ఇవి పరస్పర విరుద్ధమైన సూత్రాలుగా కనిపించినా వాటి మధ్య గుర్తిందగిన భేదం ఉన్నది. మొదటిది అధికారుల పట్ల రాజు ప్రదర్శించాల్సిన విచక్షణకు సంబంధించినది. రెండోది ఆర్థిక వ్యవహారాల్లో పాటించాల్సిన క్రమశిక్షణకు సంబంధించినది.

అధినేతకు ఉండాల్సిన లక్షణం ఇదీ!

ఒక కార్యాలయంలో చైర్మన్ సంచాలకులతో సమావేశం నిర్వహిస్తున్నాడు. ముఖ్యమైన అంశాలను చర్చిస్తున్న సమయంలో ‘ఆఫీస్ బాయ్‘ అందరికీ ‘కాఫీ‘ ఇస్తున్నాడు. పొరపాటున అతని చేతిలోని కాఫీ కప్పు ఒలికిపోయి కాఫీ బల్లపై పడింది. సమావేశంలోని వారంతా ఒకరిముఖాలు ఒకరు చూచుకోసాగారు. అంతటితో తన ఉద్యోగం పోయిందనే భయంతో ఆ పిల్లవాడు వణికిపోయాడు. సమావేశ మందిరమంతా నిశ్శబ్దం.  ఇంతలో చైర్మన్ తన స్థానం నుంచి లేచి వెళ్లి ఒక టిష్యూపేపర్‌తో.. ఆ బల్లపై ఒలికిన కాఫీని తుడిచి శుభ్రంచేశాడు. సభ్యులందరూ అతను చేస్తున్న పనిని ఆశ్చర్యంగా, ఆసక్తితో చూడసాగారు.

అప్పుడు చైర్మన్ అన్నాడు.. ‘ఒలికింది పిల్లవాడు కాదు, కాఫీ మాత్రమే. చిన్న పొరపాటు అతని స్థాయిని లేదా హుందాతనాన్ని తగ్గించదు’ అంటూ ఆ పిల్లవాని భుజం తట్టాడు. కన్నీటిపర్యంతమైన ఆ పిల్లవాడు కృతజ్ఞతతో నమస్కరిస్తూ.. వెళ్లిపోయాడు. అప్పుడు చైర్మన్ సభ్యులవైపు తిరిగి.. ‘మిత్రులారా..! కాఫీ తిరిగి తేవచ్చు కానీ అతనిది పొరపాటని తెలిసినా, ఆవేశంలో అతనిపై అరిస్తే... పగిలిన అతని హృదయాన్ని అతికించలేముకదా’ అన్నాడు. హాల్ అంతా కరతాళధ్వనులతో మార్మోగింది. నిజానికి సభ్యులకది సమావేశంగా కాక ఒక యాజమాన్య నిర్వహణా పాఠంగా కనిపించింది.

తప్పును సరిచేయడం అవసరం

రాజు కావచ్చు, ఉన్నతోద్యోగి కావచ్చు, పెద్ద నాయకుడు కావచ్చు, అధికారం తమచేతిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడనేదే వారి శీలాన్ని ప్రకటిస్తుంది. తప్పుచేసిన వాడిని అవసరమైతే దండించాలి.. కానీ, ముందుగా తప్పును సరిచేయడం అవసరం. వ్యక్తులను అవమానించడం, తక్కువగా చూడడం వల్ల పదవికున్న సంస్కారం తగ్గిపోతుంది. ఒక వ్యక్తి తానున్న వాతావరణంలో ఎలా పనిచేస్తున్నాడన్నది ఆ వ్యక్తి ప్రవర్తనగా నిర్ధారించవచ్చునంటాడు ‘కర్ట్ లెవిన్’ అనే సైకాలజిస్ట్.

దీనిని మరొక కోణంలో చెప్పుకుంటే... ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిగత లక్షణాలతోపాటు, అతను పనిచేసే వాతావరణం వల్ల కూడా ప్రభావితమవుతుందనవచ్చు. ఈ ఉదంతంలో సహనాన్ని, క్షమనే కాక విచక్షణను ప్రదర్శించిన చైర్మన్ వివేచన ఉత్తమ నాయకునికి ఉండవలసిన శీలాన్ని, ప్రవర్తనను ప్రకటించింది.

ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా.. 

కార్యాలయంలో ఉద్యోగి స్థానం ఏదైనా కావచ్చు కానీ అతని పనితీరును గమనిస్తూ అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాయకునికి ఉంటుంది. ఒక కార్యాలయంలో చాలా సంవత్సరాలుగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్న ఉద్యోగిని ఒకనాడు యజమాని తన కార్యాలయానికి పిలిపించాడు. ఉద్యోగి కుతూహలంతో యజమానిని కలిశాడు. ఉద్యోగిని చూస్తూనే యజమాని.. నవ్వుతూ ‘మిత్రమా నేను చాలా సంవత్సరాల నుంచి మీ పనితీరును గమనిస్తున్నాను’ అన్నాడు.

ధన్యవాదాలు తెలిపి ఉద్యోగి సంతోషంతో వెళ్లిపోయాడు. అతనికి పదోన్నతిని ఇవ్వలేదు, వేతనాన్ని పెంచలేదు. ఏ బహుమతినీ ప్రకటించలేదు.. అయినా ఉద్యోగి ఉప్పొంగిపోయాడు. తన పనితీరు గుర్తింపబడిందనే భావన అతనిలో స్ఫూర్తి నింపింది. ఆ వాతావరణంలో పనిచేసే ఉద్యోగి పనితనం ఉన్నతంగా ఉంటుంది. 

సాధారణంగా వ్యక్తుల పనితీరు పరిమితులకు లోబడి ఉంటుంది. కానీ, చిన్న ప్రోత్సాహకరమైన పలుకు, నేనున్నానని భుజంతట్టి స్ఫూర్తినివ్వడం లాంటివి ఆ పనితీరులో పరుచుకున్న పరిమితుల పరిధిని చెరిపివేస్తాయి. శక్తిసామర్థ్యాలను అధిక మొత్తంలో వినియోగించేందుకు ప్రేరణనిస్తాయి. అయితే ఉద్యోగిలో ఉండే సహజమైన ఉత్సాహం, సాధించాలనే తపన అతనిలో నిద్రాణమైన పూర్తి శక్తిసామర్థాలను వినియోగించుకునేందుకు కారణమవుతుంది. అది వ్యక్తి ఉద్యోగ జీవితానికి మాత్రమే పరిమితం కాక, అతని జీవన ప్రవర్తనలోనే ఒక ముఖ్య భూమికను పోషిస్తుంది.

సమతుల్యత ముఖ్యం

మహాభారతంలోని శాంతిపర్వంలో ధర్మరాజుకు భీష్ముడు రాజధర్మాన్ని ఉపదేశిస్తూ.. రాజు తన సేవకుల అవసరాలను గమనించాలని, వారిపట్ల అనవసరమైన కోపాన్ని ప్రదర్శించకూడదని, వారి అంకితభావాన్ని గుర్తించి ఆదరించాలని చెప్తాడు. రాజు ప్రవర్తనలో మృదుత్వం, కాఠిన్యం రెండింటి మధ్య సమతుల్యత ఉండాలని కూడా ఉపదేశిస్తాడు. రాజు మెత్తగా ఉంటే ప్రజలు గౌరవింపరు. అలాగని అతి కాఠిన్యాన్ని ప్రదర్శిస్తే భయగ్రస్తులై తమ అభిప్రాయాలను ప్రకటింపరు.

కాబట్టి రాజు యథోచిత మార్దవాన్ని, కాఠిన్యాన్ని ప్రదర్శించాలని ఉపదేశిస్తాడు భీష్ముడు. మరొక గంభీరమైన మాటా చెప్తుంది భారతం. గర్భవతియైన స్త్రీ గర్భస్థ శిశువు హితాన్ని కాంక్షించి, తనకు ఇష్టమైన పదార్థాలను విడిచిపెట్టే విధంగా రాజు కూడా సర్వ ప్రజాహిత కాంక్షతో కర్తవ్యపాలనలో ప్రవర్తించాలి. 

రామాయణంలో సగరుడనే చక్రవర్తి ప్రజలకు హాని కలిగిస్తున్న తన కుమారుడు అసమంజసుడ్ని ప్రజల హితంకోరి విడిచివేస్తాడు. ఆధునిక నిర్వహణలో దీనినే ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథం, సందర్భోచితమైన విచక్షణతో కూడిన నాయకత్వంగా అన్వయించుకోవచ్చు.

మరిన్ని వార్తలు