నషా ముక్త్ భారత్
నేటి నుంచి యాత్ర
- అంబర్‌పేట్, ముషీరాబాద్, అమీర్‌పేట్ మీదుగా జూబ్లీహిల్స్ వరకు..
- హైదరాబాద్‌లో 3 రోజులు సాగనున్న యాత్ర
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆధ్వర్యంలో బుధవారం నుంచి ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరిట మహా పాదయాత్ర జర గనుంది. 2029 వరకు డ్రగ్స్ రహిత దేశమే(Drug-free nation) లక్ష్యంగా ప్రధాని మోదీ(Prime Minister Modi) ఇచ్చిన పిలుపుమేరకు ఈ యాత్రను కిషన్‌రెడ్డి చేపడుతున్నారు.డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే అనర్థాలపై యువత, సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలనే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. అంబర్‌పేట్, ముషీరాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ యాత్ర మూడు రోజులపాటు జరగనుంది.
మొత్తం 29.8 కి.మీ. కేంద్రమంత్రి పాదయాత్రగా ముందుకు సాగునున్నారు. బుధవారం అంబర్‌పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమవుతుంది. చివరి రోజు 27న సాయంత్రం 6.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభన వ్ వద్ద సంకల్ప సభతో ముగుస్తుంది. ప్రతి రోజూ ఈ యాత్ర ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మొదలవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు ముగిసేలా ప్లాన్ చేశారు.
ఈ యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాజివేత్తలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే సినీ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనును కిషన్‌రెడ్డి నేరుగా కలిసి యా త్రలో భాగస్వాములవ్వాలని ఆహ్వానించారు.
మహంకాళి ఆశీస్సులతో..
బుధవారం ఉదయం కేంద్రమంత్రి అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో పూజుల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ప్రముఖ సినీ నటులు విక్టరీ వెంకటేష్ జెండా ఊపి మహాపాద యాత్రను ప్రారంభిస్తారు.
తొలిరోజు రోడ్ మ్యాప్..
అంబర్‌పేట్ మహంకాళి ఆలయం నుండి యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్, 6 నంబర్ జంక్షన్, తిలక్‌నగర్ చౌరస్తా, నరసింహారావు ఆలయం, కొరంటి ఫీవర్ హాస్పిటల్, విండ్సర్ ప్లాజా, హిందీ మహావిద్యాలయ మీదుగా విద్యానగర్ చౌరస్తాకు చేరుకుంటుంది.
మధ్యాహ్న విరామం..
ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్, ఓయూ ఆరట్స్ కాలేజ్, ఇఫ్లూ యూనివర్సిటీ, ఐసీఎంఆర్ మీదుగా సాగిన యాత్ర ఓయూలోని మోడల్ హై స్కూల్ వద్దకు మధ్నాహ్నం కల్లా చేరుకుంటుంది. అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.
రాత్రి బస చేసే వరకు..
భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమై సీతాఫల్‌మండి చౌరస్తా, ఎవర్‌గ్రీన్ కేఫ్ (రైల్వే స్టేషన్ వెనుక వైపు), చిలకలగూడ క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా కశిష్ ఫంక్షన్ హాల్ వద్దకు రాత్రి వరకు చేరుకుంటుంది. మొదటి రోజు యాత్రకు ముంగిపు పలికి.. అక్కడే రాత్రి బస చేస్తారు. రెండో రోజు గురువారం కశిష్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌కు చేరుకుంటుంది. మూడో రోజు సత్యం థియేటర్ నుంచి ప్రారంభమై జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభన్ వద్ద నిర్వహించే సంకల్ప సభతో ముగుస్తుంది.
సాధుసంతుల మద్దతు..
ఈ పాదయాత్రకు సాధుసంతులు మద్దతు తెలిపారు. బీజేపీ ధార్మిక సెల్, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని చిలకలగూడ చౌరస్తా వద్ద ప్రముఖ స్వామీజీలు యాత్రకు సంఘీభావంగా కిషన్‌రెడ్డితో కలిసి భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే శంకర్ స్వామీ, యోగేష్ ప్రభు స్వామీ, శివ స్వామీ, విశ్వాత్మానంద గిరి స్వామీజీ, కృష్ణ చాముండేశ్వర మహర్షి, ఆత్మారాం మహారాజ్ తమ మద్దతు ప్రకటించారు.