మరోసారి వార్తల్లోకి పీఎస్‌ఏ పరీక్ష

25-11-2026 | 05:10am

నా రోగులకు నేను చెప్పే మాటలివి..

డాక్టర్ సీ మల్లికార్జున ఎండీ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ  

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): 35 ఏళ్ల నా యూరాలజీ(Urology) అనుభవంలో పీఎస్‌ఏ అంతగా రోగులను గందరగోళానికి గురిచేసిన రక్త పరీక్ష(Blood test) మరొకటి లేదని, ఒక్క రిపోర్టు చూసి భయంతో వణికిపోతూ వచ్చేవారు కొందరైతే, అసలు పరీక్ష చేయించుకోకుండా ఏళ్ల తరబడి ఆలస్యంగా వచ్చేవారు మరికొందరు ఉన్నారని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(ఐను)(Asian Institute of Nephrology and Urology) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సీ మల్లికార్జున(Dr. C Mallikarjuna) పేర్కొన్నారు. 

పీఎస్‌ఏ అంటే మూత్రాశయం కింద ఉండే చిన్న గ్రంథి ప్రోస్టేట్(Prostate gland) అని..అది ఉత్పత్తి చేసే ఒక పదార్థాన్ని రక్తంలో కొలవడమే ఈ పరీక్ష అని తెలిపారు. నా క్లినిక్‌లో నేను ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటేనని పీఎస్‌ఏ అనేది ప్రోస్టేట్ పరీక్షే కానీ, క్యాన్సర్ పరీక్ష కాదు. ప్రోస్టేట్ పెద్దదైనా, మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చినా, వయసు పెరిగినా కూడా దీని విలువ పెరుగుతుందని తెలిపారు. విలువ ఎక్కువగా వస్తే, మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మాత్రమే అర్థమని ఆయన అన్నారు.

కాగా 2010 తర్వాత తొలిసారిగా ఈ నెలలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రోస్టేట్ స్క్రీనింగ్ సూచనల్లో మార్పులు చేసిందన్నారు.  గతంలో ఈ నిర్ణయాన్ని ఆ వ్యక్తికీ, అతని వైద్యుడికీ వదిలేసేవారు.. ఇప్పుడైతే సాధారణ ముప్పు ఉన్న 50 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు పురుషులు రెండేళ్లకు ఒకసారి పీఎస్‌ఏ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారని డాక్టర్ మల్లికార్జున తెలిపారు. కుటుంబ చరిత్ర వంటి కారణాలతో ఎక్కువ ముప్పు ఉన్నవారు 45 ఏళ్ల నుంచే ఏటా పరీక్ష చేయించుకోవాలన్నారు.

మన దేశంలో అయితే ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ సూచించదని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన వారి విషయంలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడమే మంచిదని యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. అసలు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మన దేశంలో 40 శాతానికి పైగా రోగుల్లో క్యాన్సర్ బయటపడే సమయానికే అది ఇతర భాగాలకు వ్యాపించి ఉంటోందన్నారు.

మూడు నాలుగు ఏళ్ల ముందే వచ్చి ఉంటే వీరిలో చాలామందికి పూర్తిగా నయమయ్యేది.. చివరగా నా సలహా ఏమిటంటే.. మీకు 50 ఏళ్లు వస్తే పీఎస్‌ఏ గురించి మీ డాక్టర్‌ను అడగండి. మీ నాన్నకు లేదా సోదరుడికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చి ఉంటే 45 ఏళ్లకే అడగండి. మూత్రం ధార సన్నబడటం, రాత్రిళ్లు లేవాల్సి రావడం లేదా మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలను ‘వయసు పైబడింది కదా’  అని కొట్టిపడేయకండి అని తెలిపారు.

రిపోర్టులో విలువ ఎక్కువగా వస్తే కంగారుపడకండి, ఇంటర్‌నెట్‌లో  వెతకకండి.. కొన్ని వారాల తర్వాత మళ్లీ పరీక్ష చేయించుకోండి,. బయాప్సీకి అంగీకరించే ముందు ఎంఆర్‌ఐ గురించి అడగండి.. 70 ఏళ్లు దాటిన తర్వాత మీ ఆరోగ్య స్థితిని బట్టి మీ వైద్యుడినే నిర్ణయించనివ్వండి అని డాక్టర్ మల్లికార్జున సూచించారు.

మరిన్ని వార్తలు