బీజేపీదే ప్రభుత్వం

25-11-2026 | 05:20am

90 సీట్లు పోతాయనే కాంగ్రెస్‌లో భయం  

బీఆర్‌ఎస్‌ది ‘మోసగాడు’ సినిమా పాలన 

కరీంనగర్‌లో పాదయాత్రకు ప్రజాదరణ అపూర్వం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయేది బీజేపీ(BJP) ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(Ramchander Rao) పేర్కొన్నారు. 90 సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవేమోనన్న భయం పట్టుకుందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై(Congress, BRS) నిప్పులు చెరిగారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) నేతృత్వంలో సోమవారం కరీంనగర్‌లో(Karimnagar) నిర్వహించిన మహా పాదయాత్రకు ఉమ్మడి జిల్లా ప్రజలు, వేలాది మంది కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. కరీంనగర్(Karimnagar) గడ్డపై నుంచి పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్(Nitin Nabin) తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టమైన సందేశం ఇచ్చారని గుర్తుచేశారు.

కొడంగల్ టిల్లు, ట్విట్టర్ టిల్లు కుమ్మక్కు

బీజేపీ కార్యక్రమాలకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ నాయకుల్లో అసహనం పెరిగిందని రాంచందర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (’కొడంగల్ టిల్లు’, ’ట్విట్టర్ టిల్లు’) రెండూ ఒక్కటవుతున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తమ అవినీతి సాగదన్న భయమే ఆ రెండు పార్టీలను కలుపుతోందని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. 

కృష్ణా జలాలపై దోబూచులాట..

తెలంగాణకు రావాల్సిన 512 టీఎంసీల కృష్ణా జలాల వాటాకు బదులుగా, 299 టీఎంసీలకే కేసీఆర్ ఎందుకు అంగీకరించారో సమాధానం చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలాడుతు న్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేసి కేసీఆర్.. ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, అదే తరహాలో దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు సుమారు రూ.13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర ం ఏమి చేసిందని ప్రశ్నించే ముందు, రాష్ట్రంలో అభివృద్ధికి మంత్రులు చేసిన కృషి ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మెట్రో డీపీఆర్ ఇవ్వకుండా ఎలా?

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర నిధులు కోరే ముందు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో డీపీఆర్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) వివరాలను స్పష్టంగా సమర్పించాలని, అవేమీ లేకుండా కేంద్రంపై నెపం వేయడం రాష్ట్ర ప్రభుత్వ అవివేకమని రాంచందర్‌రావు విమర్శించారు. ఒకపక్క రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, రూ.30 నుంచి 40 కోట్ల ప్రజాధనంతో ‘భారత్ సమ్మిట్’ నిర్వహిస్తూ, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారిని ఆహ్వానించడం దురదృష్టకరమన్నారు.

సబ్- రీజినల్ పార్టీ స్థాయికి కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ప్రాభవాన్ని కోల్పోయి, అనేక రాష్ట్రాల్లో పొత్తులపై ఆధారపడే స్థితికి దిగజారిందని ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళం వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు, మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పారదర్శకంగా జరుగుతున్న సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

బీజేపీలో చేరికలు..

ఈ సందర్భంగా కోదాడకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్, సామాజిక కార్యకర్త లావణ్య తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్. గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్‌వీ సుభాష్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు