కరువు ఖర్చు రూ.10వేల కోట్లు!
- ఐదు నెలల కోసం ప్రభుత్వం అంచనా
- ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ
- క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) : తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్.. సిద్ధాంతపరమైన చర్చలకే పరిమితం కాకుండా, వాతావరణ మార్పుల సవాళ్లకు పరిష్కారాలను సూచించే వేదికగా నిలవాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులకు సూచించారు. కరువును తట్టుకునే వ్యవస్థల నిర్మాణం, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయంపై(Agriculture) ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కాంక్లేవ్‌లో లోతైన చర్చ జరగాలని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో(Invest Telangana Global Summit) భాగంగా నిర్వహించే క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సమీక్షించారు.
పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan), టీజీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఇతర అధికారులు పలువురు ఈ సమీక్షకు హాజరయ్యారు. కాంక్లేవ్‌లో ఐదు నెలల ఎల్ నినో సన్నద్ధత కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. సుమారు రూ.10 వేల కోట్ల అంచనాతో సంక్రాంతి తరువాత ప్రతి నెలా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులను అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు.
చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు సంబంధించిన పనులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇక ప్రజలకు తాగునీరు, ఆహార భద్రతపై ప్రభుత్వ కార్యాచరణను కాంక్లేవ్‌లో వివరించాలని అధికారులకు సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విస్తరణ, శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమల్లో తిరిగి వినియోగించడం, తెలంగాణను నెట్-జీరో లక్ష్యాల దిశగా తీసుకెళ్లే చర్యలపైనా సమీక్షలో చర్చించారు.
రాష్ట్రంలోని డేటా సెంటర్లు తమ మొత్తం విద్యుత్ అవసరాల్లో కనీసం 51 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సమకూర్చుకోవాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని అధికారులు వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర అభివృద్ధిలో తెలంగాణను దేశానికి మార్గదర్శకంగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ కాంక్లేవ్ మరింత బలోపేతం చేయనుందన్నారు.