జెన్ జీ నిరసనల్లో సాహిత్యం ఎక్కడ?

26-10-2026 | 05:00am

ఇప్పుడు ఎవరి నోట విన్నా జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా! ‘జెనరేషన్’(Generation) అనే పదమే ఒక నానుడిగా మారిపోయింది. ప్రతి తరానికీ ఒక ప్రత్యేకమైన జీవనశైలి, ఆలోచనా విధానం, సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం, సామాజిక స్పందన ఉంటాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో భారతదేశంలో యువతకు సంబంధించిన సమకాలీన నిరసనలు, డిజిటల్ వేదికలపై జరిగే చర్చలు, విద్య, ఉపాధి, పరీక్షా విధానాలు, సంస్థాగత వైఫల్యాలపై వ్యక్తమవుతున్న అసంతృప్తి ఒక కొత్త తరహా పౌర భాగస్వామ్యాన్ని సూచిస్తున్నాయి.

సోషల్ మీడియా, డిజిటల్ నెట్వర్క్‌లు, హ్యాష్‌ట్యాగ్‌లు,  ఆన్‌లైన్ ప్రచారాలు ఈ తరపు నిరసనలకు ప్రధాన సాధనాలుగా మారాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతున్నది. నేటి ఉద్యమాలకు డిజిటల్ మాధ్యమాలు ఉన్నాయి. వేగంగా స్పందించే సోషల్ మీడియా ఉంది. క్షణాల్లో లక్షల మందికి చేరే వీడియోలు, పోస్టులు ఉన్నాయి.

అయితే.. గత తరాల ఉద్యమాల్లో కనిపించినట్లుగా కవిత్వం, పాట, నాటకం, బుర్రకథ వంటి కళారూపాలు ఇప్పుడు ఉద్యమ చైతన్యానికి అంతగా కేంద్రంగా కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్న మనల్ని స్వాతంత్య్రానంతర తొలి దశల నుంచి 1960ల తెలుగు సాహిత్య ప్రపంచానికి తీసుకెళ్తుంది.

ఉద్యమం నుంచి సాహిత్యం... సాహిత్యం నుంచి ఉద్యమం

స్వాతంత్య్రం సిద్ధించి ఎక్కువ కాలం గడవకముందే దేశంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమాన విద్య, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై యువతలో ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రోద్యమం, ఆంధ్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం వంటి అనేక సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ప్రజాకవిత్వం, పాట, జానపద కళారూపాలు ప్రజలను చైతన్యపరిచే సాధనాలుగా పనిచేశాయి.

బుర్రకథ ద్వారా ప్రజల్లోకి వెళ్లిన నాజర్, తన కవిత్వం  విప్లవాత్మక రచనలతో ప్రభావం చూపిన సుబ్బారావు పాణిగ్రాహి, తరువాతి దశల్లో ప్రజా గాయకులు, కవులు, కళాకారులుగా నిలిచిన గద్దర్, వంగపండు ప్రసాదరావు తదితరులు సాహిత్యం, పాట, ప్రదర్శన కళలకు ఉద్యమ స్వరాన్ని ఇచ్చినవారిగా గుర్తించబడతారు. అంటే అప్పటి ఉద్యమానికి కేవలం రాజకీయ నినాదం మాత్రమే లేదు. దానికి పాట ఉంది, పద్యం ఉంది, కథ ఉంది, కళ ఉంది. ఈ నేపథ్యంలోని మరో ముఖ్యమైన మలుపే దిగంబర కవిత్వ ఉద్యమం.

దిగంబర కవిత్వం ఒక ‘షాక్ ట్రీట్మెంట్’

1960ల మధ్యకాలంలో తెలుగు సాహిత్య ప్రపంచంలోకి వచ్చిన దిగంబర కవిత్వం ఒక సాధారణ కవితా ధోరణి కాదు. అది అప్పటి సాహిత్య వ్యవస్థపై, సామాజిక అసమానతలపై, రాజకీయఆర్థిక అన్యాయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నిరసనాత్మక సాహిత్య ఉద్యమం. ఆ కాలంలో కొంతమంది యువ కవులకు తెలుగు సాహిత్యం సమాజంలోని అసలు సమస్యల నుంచి దూరమవుతోందనే భావన కలిగింది.

ప్రేమ, వినోదం, సంచలనాత్మక కథనం లేదా పాలక అనుకూల ధోరణులు సాహిత్యాన్ని ఆక్రమిస్తున్నాయని వారు భావించారు. సమాజంలోని వాస్తవ సమస్యలను నేరుగా ఎదుర్కొనే కవిత్వం అవసరమని వారు ప్రకటించారు. అందుకే దిగంబర కవిత్వం ఒక రకమైన ‘షాక్ ట్రీట్మెంట్’గా తనను తాను ప్రతిపాదించుకుంది. ‘దిగంబరం’ అంటే దిక్కులనే అంబరంగా కలిగి ఉండటం.

సాహిత్య సందర్భంలో ఇది ముసుగులు, అలంకారాలు, కృత్రిమతలను తొలగించి వాస్తవాన్ని యథాతథంగా చూపించడం అనే భావానికి దగ్గరగా ఉపయోగించబడింది. ఆరుగురు యువకవులు ఆరు కలం పేర్లతో దిగంబర కవిత్వాన్ని అందించారు. నగ్నమునిగా మానేపల్లి హృషీకేశవరావు, నిఖిలేశ్వర్‌గా కే యాదవరెడ్డి, చెరబండరాజుగా బద్దం భాస్కరరెడ్డి, జ్వాలాముఖిగా వీరవెల్లి రాఘవాచార్యులు, మహాస్వప్నగా కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, భైరవయ్యగా మన్మోహన్ సహాయ్ కలాలను సంధించారు.

దిగంబర కవుల నిరసన కేవలం కవితల్లోనే ఆగిపోలేదు. వారి కవితా సంపుటాల ఆవిష్కరణ కూడా ఒక సామాజిక ప్రకటనగా మారింది. మొదటి సంపుటిని 1965లో హైదరాబాద్లో రిక్షా కార్మికుడు నాంపల్లి పాండు ఆవిష్కరించడం, రెండో సంపుటిని 1966లో విజయవాడలో జంగాల చిట్టి ఆవిష్కరించడం, మూడో సంపుటిని 1968లో విశాఖపట్నంలో బిచ్చగత్తె ఎడమసూరి యశోద ఆవిష్కరించడం..వంటివి సంప్రదాయ భావనలకు సవాల్‌గా నిలిచాయి. వారు తమ రచనలను సాధారణంగా ఉన్న ‘వచన కవిత’ అనే పరిధిలో పెట్టడానికి ఇష్టపడలేదు.

తమ కవితలకు ప్రత్యేకమైన స్వరూపాన్ని ప్రకటించుకున్నారు. తమ కవితలను ‘ధిక్’లు అని పిలిచారు. ఈ పేరులోనే నిరసన ఉంది. ‘ధిక్’ అంటే తిరస్కారం. నిరాకరణ. ప్రశ్నించడం. అంగీకరించకపోవడం. అందువల్ల దిగంబర కవిత్వాన్ని కేవలం ఒక సాహిత్య ప్రక్రియగా కాకుండా, ఒక తరం తన కాలంతో చేసిన వాదనగా చూడవచ్చు.

దిగంబర కవుల భాష అప్పటి సాహిత్య మర్యాదలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించింది. కొన్నిసార్లు వారి పదజాలం తీవ్రంగా, అసభ్యంగా, దిగ్భ్రాంతి కలిగించేలా కనిపించింది. ఇదే వారి బలం అని కొందరు భావిస్తే, ఇదే వారి పరిమితి అని మరికొందరు విమర్శించారు. ఆ కవుల ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది.. సమాజం నిద్రలో ఉంటే మృదువైన మాటలతో కాదు, గట్టిగా కుదిపి మేల్కొలపాలి! దిగంబర కవులలో కొందరు తరువాత విప్లవ రచయితల సంఘం (విరసం)తో అనుబంధం ఏర్పరుచుకున్నారు.

వారి సాహిత్య ప్రయాణాలు అక్కడితో ఒకే దిశలో కొనసాగలేదు. కొందరు మార్క్సిజం వైపు, మరికొందరు ఇతర తాత్విక ధోరణుల వైపు మళ్లారు. కొందరు వ్యక్తిగత రచనా జీవితాన్ని కొనసాగించారు. ఇది ఒక ముఖ్యమైన పాఠాన్ని కూడా చెప్తుంది.. ఒక ఉద్యమం ఒకే రూపంలో శాశ్వతంగా ఉండదు.దాని ప్రభావం తరువాతి తరాల ఆలోచనల్లో, రచనల్లో, కళల్లో, ప్రశ్నల్లో కొనసాగవచ్చు.

మరి నేటి జెన్ జీ ఎక్కడ నిలుస్తుంది?

ఇక్కడే మనం మళ్లీ నేటి తరానికి రావాలి. జెన్ జీ లేదా తరువాతి తరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవి. పరీక్షల ఒత్తిడి, విద్యా వ్యవస్థపై అసంతృప్తి, ఉద్యోగ అవకాశాలపై ఆందోళన, ఆర్థిక అస్థిరత, డిజిటల్ జీవితం, సమాచార విస్ఫోటనం, సామాజిక మాధ్యమాల ప్రభావం  ఇవన్నీ వారి అనుభవ ప్రపంచంలో భాగం. వారి నిరసన పద్ధతులు కూడా మారాయి.

అప్పట్లో..  కవిత పాట బుర్రకథ సభ వీధి ఉద్యమం. అయితే ఇప్పుడు తరచుగా..  పోస్ట్ వీడియో హ్యాష్ ట్యాగ్ వైరల్ ప్రచారం డిజిటల్ సమీకరణ నిరసన.. అనే క్రమం కనిపిస్తున్నది. ఇది కేవలం మాధ్యమం మారడం కాదు. ఉద్యమ భాషే మారడం. అయితే ఒక కీలకమైన తేడా ఉంది. దిగంబర కవుల కవిత్వం వారి కాలపు సామాజిక అసంతృప్తికి ఒక సాహిత్య భాషను సృష్టించింది. నేటి డిజిటల్ నిరసనలకు అలాంటి దీర్ఘకాలిక సాహిత్య రూపం ఇంకా ఎంతవరకు ఏర్పడిందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుంది.

ఉద్యమానికి సాహిత్యం అవసరమా?

ఒకప్పుడు కవి ఉద్యమంలో భాగం. పాట ఉద్యమానికి ఆయుధం. కవిత నినాదంగా మారేది. నాటకం సభగా మారేది. బుర్రకథ ప్రజా వేదికగా మారేది. ఇప్పుడు ఒక వీడియో లక్షల మందికి చేరుతుంది. ఒక పోస్టు కొన్ని గంటల్లో వైరల్ అవుతుంది. ఒక హ్యాష్‌ట్యాగ్ ఒక సమస్యను జాతీయ చర్చగా మార్చగలదు. కానీ.. వైరల్ కావడం, చారిత్రకంగా నిలిచే సాంస్కృతిక వ్యక్తీకరణగా మారడం ఒకటే కాదు.

డిజిటల్ నిరసన వేగాన్ని ఇస్తుంది. సాహిత్యం జ్ఞాపకాన్ని ఇస్తుంది. సోషల్ మీడియా తక్షణ స్పందనను ఇస్తుంది. కవిత్వం ఆ స్పందనకు భాషను ఇస్తుంది. నినాదం జనాన్ని సమీకరించవచ్చు. సాహిత్యం ఆ సమాజపు అంతరంగాన్ని నమోదు చేయగలదు. అందుకే నేటి యువత ఉద్యమాల గురించి మాట్లాడేటప్పుడు కేవలం అవి ఎంత వైరల్ అయ్యాయనే ప్రశ్నతో ఆగిపోకుండా..

ఆ ఉద్యమాలు ఏ పాటను పుట్టించాయి? ఏ కవితను సృష్టించాయి? ఏ కథను మిగిల్చాయి? ఏ సాంస్కృతిక జ్ఞాపకాన్ని నిర్మించాయి? అనే ప్రశ్నలు కూడా వేయాల్సి ఉంటుంది.

 వ్యాసకర్త సెల్: 9989988912


మరిన్ని వార్తలు