‘సర్’తో ఈసీకి భంగపాటు!
రష్యా, బ్రెజిల్, వెనెజువెలా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులు ఎన్నికల సంఘం(Indian Election Commission)(ఎలక్షన్ కమిషన్.. ఈసీ)ను అడ్డం పెట్టుకొని పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడటం ద్వారా గెలిచారనే ఆరోపణలు విన పడేవి. ప్రజాస్వామిక వ్యవస్థల్లో ఈసీ పాత్ర, ఎన్నికల నిర్వహణ విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించినప్పుడే ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి.
ప్ర పంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామిక దేశమే కాదు.. అత్యధిక ఓటర్లు కలిగి న ఎన్నికల వ్యవస్థ కూడా. 1952లో ఎన్నికల కమిషన్ ఏర్పాటైన తరువాత అనేక రాష్ట్రాల్లోనే కాకుండా 18 పర్యాయాలు లోక్‌సభకు సాధారణ ఎన్నికల కూడా నిర్వహించిన చరిత్ర భారత ఎన్నికల కమిషన్‌ది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, సర్వ స్వతంత్రంగా వ్యవహరించే ఈ వ్యవస్థపైనా, ప్రధాన ఎన్నికల కమిషనర్(చీఫ్ ఎలక్షన్ కమిషనర్.. సీఈసీ)పైనా ఎన్నడూ లేనివిధంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
‘సర్’ ప్రక్రియ ద్వారా పెద్ద మొత్తంలో ఓట్లు తొలగిస్తూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఈసీ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విపక్షాలు, యువత, విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేప థ్యంలో దేశంలో అత్యంత ప్రధానమైన ఎన్నికల వ్యవస్థ పైనా, దాని విశ్వసనీయత, పారదర్శకత, నిష్పక్షపాతంపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఆరంభం నుంచీ ఆరోపణలే
2025 కంటే ముందు భారత్‌లో ఈసీ 8 సార్లు ఓటర్ల జాబితా సవరణ నిర్వహించింది. కానీ ఇప్పటిలా గతంలో ఏనాడూ ఎలాంటి ఆరోపణలు రాలేదు. 9వ పర్యాయం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘సర్’ ప్రక్రియ మొదలైంది. అప్ప టి నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాదాపు 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాల్లో ఈ ‘సర్’ ద్వారా 13 కోట్ల ఓట్లను (దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఓట్లకు సమా నం) తొలగించటంతో ఈసీ పనితీరుపై తీవ్ర అభ్యంత రాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 8 పర్యాయాలు జరిగిన ఓటర్ల సవరణపై ఎలాంటి అభ్యంతరాలు రానిది.. 9వ సారి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతుం టే సవరణ ప్రక్రియ సజావుగా జరుగు తున్నదని ఎలా భావించగలం?
ఓట్ల తొలగింపుతో అధికార మార్పిడి!
బీహార్ తుది జాబితాలో 47లక్షల ఓట్లు తొలగించారు. అందువల్లే ఆ రాష్ట్రం లో ఎన్‌డీఏ కూటమి భారీ విజయం సాధించిందనే ఆరోపణలున్నాయి. పశ్చి మ బెంగాల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ‘సర్’ కొనసాగించటం ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా మాల్డా లాంటి ప్రాంతంలో ఈసీ, జ్యుడీషియల్ అధికారులపై ప్రజలు దాడి చేశారు. 27 లక్షల అర్హులైన ఓటర్లను జాబితా నుం చి తొలగించారనే ఆరోపణలతో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ విచారణ చేస్తుంటే బెంగా ల్‌లో సర్ ఎంత గందరగోళంగా మారిం దో అర్థం చేసుకోవచ్చు.
బెంగాల్‌లో గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి ఓట్ల వ్యత్యాసం 4 శాతం. మరి తొలగించిన ఓట్లు ఏకంగా 12 శాతం. తమిళనాడులో కూడా ‘సర్’ తొలగించిన ఓట్ల వల్లే డీఎంకే ఓటమిపాలైందని ఆ రాష్ట్ర మాజీ సీఎం ఎంకే స్టాలిన్ వాదిస్తున్నారు. 30 నుండి 80 వేలకు పైగా ఓట్లు తొలగించిన 69 నియోజకవర్గాల్లో 52 చోట్ల టీవీకే గెలిచిందని స్టాలిన్ ఆరోపణ.
తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించారు. ఆంధ్రప్రదేశ్ లో 44 లక్షల ఓట్లు, తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అభ్యంతరాలు లేవు కానీ, ప్రాథ మిక ముసాయిదా జాబితాలో ఉన్న 93 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వీరిలో 60 లక్షల మంది ఓటర్లు విచారణకు హాజరైతే.. 46 లక్షల మంది అర్హులుగా తేలారంటే చిన్నచిన్న కారణాలతో కూడా ఈసీ ఓట్ల తొలగింపునకు సిద్ధపడినట్లుగా రుజువయింది.
తెలంగాణలో ఈ 46 లక్షల మంది తమ ఓటును కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో వారిని అడిగితే ఈసీ నిర్వా కం, అసమర్థత బయటపడుతుంది. బెంగాల్‌లో ఫరక్క అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రె స్ ఎమ్మెల్యేగా గెలిచిన మోతాబ్ షేక్ ఓటు ను కూడా చిన్న కారణాలతో తొలగించటం..
ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి తన ఓటును కాపాడుకోవడం గమనార్హం. ఈసీ కఠిన నిబంధనల వల్ల దేశంలో కోట్లాది మంది ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు, అల్ప సంఖ్యాకులు, అత్యంత వెనుకబడిన వర్గాలు, మహిళలు తమ ఓటు హక్కును కోల్పోయారు.. కాబట్టే సామాజిక - ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ‘సర్’ ప్రక్రియ ద్వారా కోట్లాది ఓట్లను తొలగించటాన్ని రక్తపాత రహిత నరమేధంగా అభివర్ణించారు.
సీఈసీ వ్యవహార శైలిపైనే!
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలిపైనా, తన ఎంపిక విధానంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కేరళ మాజీ చీఫ్ సెక్రటరీని బీజేపీ తరఫున పంతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయాలని సీఈసీ అడిగినట్లుగా స్వయం గా జీజీ థామ్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, జాతీయ మీడియాకు చెందిన రితిక చోప్రా పది నెలల్లో 14 కీలకమైన అంశాలపై సీఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో పాటు, ‘సర్’ ప్రక్రియలో ఓట్లను తొలగించే అధికారాన్ని బీఎల్‌వోలకు, వీఆర్వోలకు ఇచ్చి.. విచారణ తరువాత అర్హులైన ఓటర్లను చేర్చే అధికారాన్ని మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఈసీఐ.
నెట్ వద్ద ఉంచుకోవడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతం పై అనుమానాలకు దారితీస్తోంది. 2023 లో సీఈసీ ఎంపిక విధానాన్ని మార్చిన తర్వాత ఎంపికైన మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడనే అభిప్రాయా లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 25 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లపైన రాని ఆరోపణలు ప్రస్తుత సీఈసీపై రావటం ఎన్నికల కమిషన్ ప్రతిష్టను దెబ్బతీసిందనే చెప్పాలి.
కమిషన్ ప్రధాన తప్పిదాలు!
కొత్త ఓటర్లను చేర్చడానికి, ఓటర్లను తొలగించటానికి, తప్పులను సరి చేయటానికి జారీ చేసిన ఫామ్ -6, 7, 8లను పార దర్శకంగా సమర్థవంతంగా నిర్వహించడంలో ఈసీ వైఫల్యం చెందటం, విచారణ తరువాత తొలగించిన ఓట్లను చేర్చే అధికారాన్ని కిందిస్థాయి అధికారులకు కాకుం డా కమిషన్ తన వద్ద ఉంచుకోవడం, కిందిస్థాయి అధికారుల అసమర్ధత వలన మొత్తం సర్ ప్రక్రియ గందరగోళంగా మా రింది.
సర్ ప్రక్రియను ఎలాంటి ఆరోపణలకు, వివాదాలకు తావులేకుండా నిర్వ హించడంలో సీఈసీ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలను కాపాడటానికి సీఈసీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలనే అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.
ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ఇలాంటి తీవ్రమైన ఆరోప ణలు వచ్చినప్పుడు అత్యున్నత వ్యవస్థలకు నాయకత్వం వహించేవారు స్వచ్ఛందంగా బాధ్యతల నుండి తప్పుకొని ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలి. భవిష్యత్తులో ప్రధాన ఎన్నికల కమిషనర్ పై ఇ లాంటి ఆరోపణలు పునరావృతం కాకుం డా ఉండాలంటే 2023కు పూర్వం ఉన్న ఎంపిక ప్రక్రియను పునరుద్ధరించాలి.
వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, 9885465877