చట్టం ముందు అందరూ సమానులే
ఎమ్మెల్యే నాయిని.
హనుమకొండ, నవంబర్ 21(విజయక్రాంతి): చట్టం ముందు అందరూ సమాను లేనని, న్యాయవాద వృత్తి(Legal Profession) కేవలం ఉపాధి మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ(Kakatiya University) అనుబంధ ఆదర్శ లా కాలేజీలో(Adarsha Law College) శనివారం ‘ది ఆర్ట్ ఆఫ్ సివిల్ లిటిగేషన్, డ్రాఫ్టింగ్ ఆఫ్ సూట్స్, విచారణ వ్యూహాలు మరియు కోర్టు హాల్ నైపుణ్యాలు – సమర్థ వాదనకు మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ప్రతిభా రెడ్డి అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, ‘సెంటర్ ఫర్ ప్రాక్టీసింగ్ లా’ వ్యవస్థాపకులు ఎం.పి. సుబ్రహ్మణ్యం ముఖ్య వక్తగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య వక్త సుబ్రహ్మణ్యం సివిల్ దావాల డ్రాఫ్టింగ్‌లో పాటించాల్సిన మెలకువలు, కేసుల విచారణ సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, కోర్టు హాల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు వివరించారు.
పుస్తక జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ అనుభవం, నిరంతర సాధన న్యాయవాద వృత్తిలో రాణించడానికి ఎంతో అవసరమని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తమను ఈ స్థాయికి తీర్చిదిద్దిన సమాజానికి తిరిగి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయవాదులు న్యాయం కోసం ఎదురుచూసే సామాన్య ప్రజలకు అండగా నిలవాలని, న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేలా తమ వృత్తి బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ సందేహాలను ముఖ్య వక్తను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వృత్తి జీవితంలోకి అడుగుపెట్టే న్యాయ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చైర్మన్ బూర విద్యాసాగర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ప్రతిభా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.