పొగమంచులో అప్రమత్తతే రక్షణ
కొండాపూర్, నవంబర్ 21: శీతాకాలం ప్రారంభం కావడంతో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్ముకుంటోంది. దీంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు, ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి (SI Someshwari) హెచ్చరించారు. పొగమంచు సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం (Road Safety) కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటనలో సూచించారు.
ముఖ్యంగా ఉదయం వేళల్లో ప్రయాణించే వాహనదారులు వాహనాల హెడ్లైట్లు, పార్కింగ్ లైట్లు (Parking Lights) తప్పనిసరిగా వినియోగించాలని, పొగమంచు తీవ్రతను బట్టి వేగాన్ని తగ్గించుకోవాలని తెలిపారు. ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని, అనవసరంగా ఓవర్టేక్ చేయడం, వేగంగా నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే హారన్ వినియోగిస్తూ రహదారిపై స్పష్టత లేని సమయంలో మరింత జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. వాహనాల బ్రేకులు, లైట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేసుకోవాలని తెలిపారు. పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయాణాన్ని కొనసాగించకుండా సురక్షితమైన ప్రదేశంలో వాహనాన్ని నిలిపి, పరిస్థితులు అనుకూలించిన తర్వాత ముందుకు వెళ్లాలని సూచించారు.
ప్రయాణం ఎంత ముఖ్యమో.. ప్రాణం అంతకంటే విలువైనదని ఎస్సై సోమేశ్వరి అన్నారు. గమ్యస్థానానికి కొన్ని నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నా ఫర్వాలేదని, వేగంగా వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి భద్రతకు కూడా బాధ్యత వహించాలని సూచించారు. పొగమంచులో వేగం కంటే జాగ్రత్తే ముఖ్యమని, ఇంటి నుంచి క్షేమంగా బయలుదేరి సురక్షితంగా తిరిగి చేరుకోవడమే ప్రతి ప్రయాణం లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.