మంత్రి OSD పేరుతో భారీ మోసం
ఉద్యోగం ఆశ చూపించి రూ.50 లక్షలు కొట్టేశాడు.. చివరకు బండారం బయటపడింది!
హైదరాబాద్: మంత్రి పేరు.. నకిలీ ఐడీ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగాల హామీ.. చివరకు రూ.50.87 లక్షల మోసం! నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు(Government Jobs) ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) కార్యాలయంలో OSDగా పనిచేస్తున్నానంటూ నమ్మించిన కొలుగూరి రవికిరణ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మంత్రి కార్యాలయానికి చెందిన అధికారినంటూ నకిలీ Identity Card సృష్టించి నిరుద్యోగులను తన వలలో వేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి నలుగురు బాధితుల నుంచి మొత్తం రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్, మున్సిపల్ అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరిని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో నిందితుడు మరింత పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. కేవలం నకిలీ OSD ఐడీ కార్డుతోనే ఆగకుండా, ప్రభుత్వ నియామక ఉత్తర్వుల తరహాలో Fake Appointment Orders తయారు చేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా అసలు ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ Portals రూపొందించి బాధితులకు చూపించినట్లు పేర్కొన్నారు. దీంతో అవి నిజమైన ప్రభుత్వ ప్రక్రియలేనని నమ్మిన అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు ఫిర్యాదులో వివరించారు.
మంత్రి కార్యాలయానికి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులను ఆశ్రయించారు. కొలుగూరి రవికిరణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ వెబ్సైట్లు, Digital Evidence, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించాలని ఫిర్యాదులో కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.