మెటా ఆఫీసులో యూత్ కాంగ్రెస్ రచ్చ.. (వీడియో వైరల్)

21-11-2026 | 01:11pm

హైదరాబాద్ మెటా కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన.. 21 మంది కార్యకర్తల అదుపులోకి

హైదరాబాద్: సోషల్ మీడియా ఖాతాల వివాదం హైదరాబాద్‌లో రాజకీయ దుమారం రేపింది. తమ జాతీయ నాయకుల Instagram Accounts నిలిపివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్(Telangana Youth Congress) కార్యకర్తలు రాయదుర్గంలోని Meta కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో సుమారు 25 మంది కార్యకర్తలు స్కైవ్యూ భవనంలోకి ప్రవేశించి కేంద్ర ప్రభుత్వం, మెటా సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కారిడార్‌లోని కొన్ని పూలకుండీలు ధ్వంసమయ్యాయి.

భారత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇన్‌ఛార్జ్ మనీష్ శర్మల Instagram Accounts నిలిపివేయడం వెనుక Political Pressure ఉందని ఆ పార్టీ ఆరోపించింది. ఖాతాలపై విధించిన ఆంక్షలను ఏడు రోజుల్లోగా ఎత్తివేయాలని Metaకు Deadline విధించింది. లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఇదే అంశంపై ముంబైలోని మెటా కార్యాలయం వెలుపల కూడా యూత్ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఆందోళనపై సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సుమారు 21 మంది కార్యకర్తలను ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. నిరసనకారులు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించలేదని, మెటా సంస్థ నుంచి అధికారిక ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రైవేట్ సంస్థల కార్యాలయాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు గూండాయిజానికి పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. మరోవైపు, ఎన్నో ఏళ్ల కృషితో నిర్మించిన ‘Brand Hyderabad’ ప్రతిష్ఠ ఇలాంటి ఘటనలతో దెబ్బతింటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంస్థలు రాజకీయాలకు దూరంగా వ్యాపారం చేసుకునే వాతావరణం ఉండాలని, ప్రభుత్వాలు వాటిపై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలపై మెటా నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.


మరిన్ని వార్తలు