బావిలో కప్పల మాదిరి బలికావద్దు..!
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
నాగర్ కర్నూల్ ( విజయక్రాంతి ): ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ(SC, ST, BC, and Minority) బిడ్డలు బావిలో కప్పల మాదిరి నాగుపాములకు బలికావద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అన్నారు. శనివారం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకొలు గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ముదిరాజులను బిసి ఎ లోకి మార్చాలని పోరాడుతున్న క్రమంలో అధికారాన్ని చేత బట్టేందుకే పోరాటం చేయాలని ఉన్నత వర్గాల వారు బీసీల మధ్య గొడవలు పెట్టి రాజ్యాలు ఏలుతున్న విషయాన్ని పసిగట్టాలన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే కులం మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతాయని వాటిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బావిలో కప్పల మాదిరి బలికాకుండా ఆలోచించాలని పేర్కొన్నారు.
కల్వకోలు గ్రామంలో ముదిరాజులు ఏర్పాటు చేయాలనుకున్న పండుగ సాయన్న విగ్రహ విషయంలో అధికార కాంగ్రెస్, బిజెపి పార్టీలు మేమంటే మేమంటూ ఒకే ఊరిలో రెండు విగ్రహాలను ఏర్పాటు చేసి ముదిరాజుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.