ప్రభుత్వ ఆసుపత్రిపై అపోహలు సృష్టించవద్దు..

21-11-2026 | 11:28pm

ప్రజలకు వైద్యసేవలపై భరోసా కల్పించండి

రాజకీయ విమర్శలు పక్కనపెట్టి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి బిఆర్ఎస్ నాయకుల సూచన

జడ్చర్ల, నవంబర్ 21: ప్రభుత్వ ఆసుపత్రిపై(Government Hospital) ప్రజల్లో అపోహలు సృష్టించకుండా, మెరుగైన వైద్య సేవలపై(medical services) భరోసా కల్పించాలని బిఆర్ఎస్ నాయకులు(BRS leaders) మాజీ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్(Praneel Chandar) ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి సూచించారు. శనివారం జడ్చర్ల పట్టణంలోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రి వివాదం ముగిసిందనుకున్న ప్రతిసారీ ఎమ్మెల్యే వివిధ బహిరంగ వేదికలపై ఆసుపత్రి స్థలంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు పెంచడం సరికాదన్నారు.

రాజకీయ విమర్శలను పక్కనపెట్టి ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ స్థలాలను వైద్యశాఖకు అప్పగిస్తే శ్వేతా ఫౌండేషన్ ద్వారా సొంతంగా రూ.25 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తానని ప్రకటించారని తెలిపారు.

ఎమ్మెల్యే సూచించిన ఎంపీడీవో కార్యాలయ స్థలాన్ని వైద్యశాఖకు బదలాయిస్తూ జీవో తీసుకువస్తే రూ.25 కోట్ల డీడీ ఇస్తానని, ఎమ్మెల్యే కూడా రూ.25 కోట్ల డీడీ సిద్ధం చేయాలని సవాల్ చేశారని గుర్తుచేశారు. జీవో వస్తే ఆసుపత్రి నిర్మాణానికి తన నిధులు వినియోగిస్తానని, లేకుంటే ఎమ్మెల్యే డీడీ మొత్తాన్ని జడ్చర్ల ప్రజల అవసరాలకు ఉపయోగించాలని సూచించారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి జీవో తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు.

ఆసుపత్రి స్థలం లోతట్టు ప్రాంతంలో ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని లక్ష్మారెడ్డి ప్రకటించారని, అలా కాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని కూడా ప్రశ్నించారని తెలిపారు. ఇటీవల నిర్వహించిన కాంటూరు లెవల్స్ సర్వే ఆధారంగా ఆసుపత్రి స్థలం లోతట్టు ప్రాంతం కాదన్నది తమ వాదనగా పేర్కొన్నారు. గూగుల్ ఎర్త్ ప్రోలో అందుబాటులో ఉన్న 2019 నాటి ఎలివేషన్ వివరాల ప్రకారం గంగాపూర్ రోడ్డు 541 మీటర్లు, ఆసుపత్రి స్థలం 542 మీటర్లుగా ఉన్నాయని వివరించారు. ఈ వివరాలను అధికారిక సర్వే రికార్డులతో పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

రూ.40 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే, వంద పడకల ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం కోసం ఎందుకు దీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. వైద్య సిబ్బంది నియామకం కోసం దీక్ష చేపడితే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో అంబులెన్స్ కొరత, లిఫ్ట్ పనిచేయకపోవడం, తాగునీటి సమస్య వంటి ఇబ్బందులు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నూతన ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారని, ఆయన సూచించిన స్థలంలోనే క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం చేపట్టినందున, కొత్త స్థలంలో రూ.12 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఎమ్మెల్యే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దాదాపు 80 శాతం పనులు పూర్తయిన పెద్ద ఆదిరాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. భవన నిర్మాణాలు పూర్తయి సిబ్బంది కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ వెల్నెస్ సెంటర్లను కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిపై రాజకీయ రాద్ధాంతం చేయడం కంటే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలని ప్రణీల్ చందర్ హితవు పలికారు. ఈ ప్రకటనలో ఇంతియాజ్, శంకర్ నాయక్, హఫీజ్ రహమాన్, ప్రశాంత్ రెడ్డి, కొండల్ , పెద్ది వెంకటేష్, సూపర్ ప్రకాష్ రాటే శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు