కళాకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో నిరుద్యోగ కళాకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని హనుమకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట తెలంగాణ ఉద్యమ కళాకారుల(Telangana movement artists) సంఘం నాయకులు నిరసన చేపట్టారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రవి, రాజుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నోజి వీరన్న మాట్లాడుతూ 'తెలంగాణ సాంస్కృతిక సారధి'(Telangana Samskruthika Saradhi) సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించి, కళాకారులను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ ఏకంచేసి రానున్న రోజుల్లో మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో సంస్కృతిక సారధిలో ఉద్యోగాలు రాని నిరుద్యోగ కళాకారులకు 2వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట చెప్పారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జ కట్టి గొంగడేసి ఆటపాటలతో ధూంధాం కార్యక్రమాలను చేపట్టామని,అలాంటి కళాకారులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం సరికాదన్నారు.గత ప్రభుత్వంలో సంస్కృతిక సారధిలో కొంతమందికే ఉద్యోగ అవకాశాలు కల్పించారాణి వాపోయారు. ఈ కార్యక్రమంలో గడ్డం సుధాకర్, బుల్లెట్ వెంకన్న, బిక్షపతి, రమేష్ ,యుగంధర్ మచ్చల కవిత, తండా సదన్న ,వరికోలు రాజేందర్, సుమన్, డప్పు శ్రీకాంత్ చాగంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.