రహదారులపై ధాన్యం ఆరబెడితే చర్యలు తప్పవు
14-10-2026 | 11:13pm
భిక్కనూర్ (విజయక్రాంతి): రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం, కుప్పలుగా పోయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్సై అనిల్(SI Anil) హెచ్చరించారు. రోడ్లపై ధాన్యం ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ట్రాఫిక్కు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా రైతులు రహదారులపై ధాన్యం ఆరబెట్టవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంట ఎంత ముఖ్యమో ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని, రోడ్డు భద్రతకు సహకరించాలని రైతులను ఎస్సై అనిల్ కోరారు.